తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, కృష్ణానది మాత్రం క్రమంగా జలకళను సంతరించుకుంటోంది. నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ధాటికి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి గణనీయంగా పెరుగుతోంది. గడిచిన వారంగా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జూరాల వైపు కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 32,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి, వచ్చిన నీటిని వచ్చినట్లే దాదాపు 30,700 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి ప్రవాహం నిలకడగా కొనసాగుతుండటంతో దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ వేగంగా చేరుతోంది.
మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమలతో పాటు భీమా నది పరీవాహక ప్రాంతాల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ భీమా నది నుంచి వచ్చే ప్రవాహాలు కూడా తోడైతే, జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లోలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఎగువ నుంచి వచ్చే ప్రవాహం రాబోయే రోజుల్లో భారీగా పెరిగే సూచనలు ఉండటంతో, దిగువన ఉన్న శ్రీశైలానికి పూర్తిస్థాయిలో జలకళ రానుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలతో పాటు రైతన్నల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి.












