దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్ -2027 అధికారిక షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. 2027 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి సెషన్-1, సెషన్-2 పరీక్షా తేదీల పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన తేదీలు, వివరాలను అధికారులు వెల్లడించారు. దేశంలోని ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
సెషన్-1 షెడ్యూల్ తేదీలు
తొలి విడత దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24న ప్రారంభమైంది. నవంబర్ 22న రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల పరీక్షా కేంద్రాల సమాచారాన్ని తెలిపే ‘సిటీ ఇంటిమేషన్ స్లిప్’ను డిసెంబర్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. అడ్మిట్ కార్డులను జనవరి 13, 2027 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. కాగా, సెషన్-1 పరీక్షలను 2027 జనవరి 20 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టంచేసింది.
సెషన్-2 షెడ్యూల్ ఇలా..
ఇక రెండో విడత పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2027 జనవరి 5 నుంచి ఫిబ్రవరి 3 వరకు కొనసాగనుంది.ఈ సెషన్‌కు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్ 12 మార్చి 2027న, అడ్మిట్ కార్డులు 25 మార్చి 2027 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. సెషన్-2 పరీక్షలను 2027 ఏప్రిల్ 2 నుంచి 7వ తేదీల్లో నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలోనే ఉంటాయి. ప్రతిరోజూ రెండు షిఫ్టులుగా నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల రెండో షిఫ్టులో పరీక్ష నిర్వహణ ఉంటుందని ఎన్టీఏ ప్రకటించింది.


