తెలంగాణ

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. స్తంభించిన పారిశ్రామిక అనుమతుల సేవలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన అత్యంత కీలకమైన పారిశ్రామిక సింగిల్ విండో అనుమతుల పోర్టల్ 'టీజీ-ఐపాస్' (TG-iPASS) సైబర్ దాడికి గురైంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సులభతరంగా అందించే ఈ 'గవర్న్‌మెంట్ టు బిజినెస్' (G2B) ప్లాట్‌ఫారమ్ సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన అత్యంత కీలకమైన పారిశ్రామిక సింగిల్ విండో అనుమతుల పోర్టల్ 'టీజీ-ఐపాస్' (TG-iPASS) సైబర్ దాడికి గురైంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సులభతరంగా అందించే ఈ 'గవర్న్‌మెంట్ టు బిజినెస్' (G2B) ప్లాట్‌ఫారమ్ సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డేటాబేస్‌ను పూర్తిగా ఎన్‌క్రిప్ట్ (Encrypt) చేయడంతో పోర్టల్ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ఘటనపై 'తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో' (TGCSB) సుమోటోగా కేసు నమోదు చేసి విస్తృత దర్యాప్తు ప్రారంభించింది.

 అధికారులు గుర్తించిన వివరాల ప్రకారం.. గత అక్టోబరు 22వ తేదీ రాత్రి 11:36 గంటలకు ఈ సైబర్ దాడి జరిగినట్లు స్పష్టమైంది. పోర్టల్ అప్లికేషన్ అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో అప్రమత్తమైన టెక్నికల్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. 'క్లౌడ్4సీ' (Cloud4C) సంస్థ సహకారంతో సర్వర్‌ను రీస్టార్ట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. లోతుగా పరిశీలించగా ఎస్‌క్యూఎల్ సర్వర్ ఏజెంట్ సర్వీస్ నిలిచిపోయినట్లు గుర్తించారు. పునరుద్ధరణ ప్రయత్నాలు విఫలమవడంతో ఇది సాంకేతిక లోపం కాదని, ప్రణాళికాబద్ధమైన హ్యాకింగ్ అని అధికారులు నిర్ధారణకు వచ్చారు.

 సర్వర్‌లోని డేటాను లాక్ చేసి, ఒక మెషిన్ ఐడెంటిఫయర్‌తో కూడిన 'రాన్‌సమ్‌నోట్' (Ransom Note)ను హ్యాకర్లు వదిలారు. సంప్రదింపుల కోసం తమ ఈ-మెయిల్ అడ్రస్‌ను కూడా అందులో పొందుపరిచారు. డేటాను బ్లాక్‌మెయిల్ చేసే ఉద్దేశంతో డేటాబేస్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడంతో దీనిని తీవ్రమైన 'రాన్‌సమ్‌వేర్ దాడి'గా భావిస్తున్నారు. ఈ ఘటనపై పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ సంగా సురేశ్ శనివారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

 ఫిర్యాదు స్వీకరించిన టీజీసీఎస్‌బీ అధికారులు, ఐటీ చట్టంలోని సెక్షన్ 43 (కంప్యూటర్ వ్యవస్థలకు నష్టం), సెక్షన్ 66 (సైబర్ నేరాలు) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. హ్యాకర్లు ప్రభుత్వ డేటాను కాపీ చేశారా? లేదా? అనే కోణంలో నిపుణులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం టీజీ-ఐపాస్ సేవలు పూర్తిగా నిలిచిపోగా, బ్యాకప్ డేటా ద్వారా డేటాబేస్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి సోమవారం నాటికి సేవలను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన ప్రయత్నిస్తున్నారు.

#TGiPASSCyberAttack#TelanganaCyberSecurityBureau#RansomwareAttack2026#TGCSBInvestigation#G2BPortalHacked#CyberCrimeNewsTelugu#TelanganaNews2026#ITAct2000
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి