తెలంగాణ

Cyclone Arnab: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. అక్టోబర్ 28 నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న రోజుల్లో బలపడి భీకర తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ముప్పునకు 'అర్నాబ్' (Cyclone Arnab) నామకరణం చేయగా, ఇది మరింత తీవ్రమై ఈ నెల 28న తీరం దాటే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న రోజుల్లో బలపడి భీకర తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ముప్పునకు 'అర్నాబ్' (Cyclone Arnab) నామకరణం చేయగా, ఇది మరింత తీవ్రమై ఈ నెల 28న తీరం దాటే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది.

 ఇదిలా ఉంటే, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. అక్టోబర్ 28వ తేదీన ఈ 'అర్నాబ్' తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని పెరుపాలెం - కోనసీమ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రత్యక్ష ప్రభావం వల్ల తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో అక్టోబర్ 28న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 కాగా, ఈ తుపాను తీవ్రత కేవలం ఒక్కరోజుతో ఆగకుండా, అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు వర్షాల రాకపై వ్యవసాయ రంగంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఎల్ నినో (El Nino) ప్రభావంతో వర్షాలు సరిగా లేక పలు ప్రాంతాల్లో వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్న తరుణంలో, ఈ వర్షాలు సాగు భూములకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.

మరోవైపు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యం కల్లాల్లో ఆరబెట్టిన తరుణంలో ఈ అకస్మిక తుపాను వర్షాలు ముప్పుగా మారే ప్రమాదముంది. గాలివాన కురిస్తే కోత దశకు వచ్చిన పంటలు నేలరాలే అవకాశం ఉందని, ధాన్యం తడిసిపోకుండా రైతులు తక్షణమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీచేస్తున్నారు.

 

#CycloneArnab2026#BayOfBengalCyclone#TelanganaRains2026#APWeatherAlert#IMDWarningTelugu#TeluguStatesWeather#AgricultureNewsTelugu#NaturalDisastersTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి