తెలంగాణ ప్రభుత్వం మీద మరోసారి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి.మొన్నటివరకు పాలిటెక్నిక్ భూముల మీద కన్నేసిన సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా ఆర్టీసీ భూములను లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రాష్ట్రంలో ఆర్టీసీకి పెద్దఎత్తున భూములు ఉన్నాయి. డిపోలు,వర్క్ షాప్స్ పేరిట నడుస్తున్నాయి. ఆ స్థలాలపైనా కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పడిందని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు ఈ స్థలాలను వాడుకోవాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ భూమిపై ఫోకస్..
ఈ క్రమంలోనే హైదరాబాద్–ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న 6 ఎకరాల 15 గుంటల ఆర్టీసీ భూమిని లాక్కునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సదరు భూమిలో పేదలకు ఇళ్లు కట్టించాలనే పేరిట తెలంగాణ హౌసింగ్ బోర్డుకు కట్టబెడుతూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కనీసం ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా, అక్టోబర్ 22న గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ శాఖ ద్వారా జీవో నంబర్ 206ను ప్రభుత్వం జారీ చేసినట్టు తెలుస్తోంది.
ఆ భూమిలోని 25 గుంటల భూమిని మానిటైజేషన్ పేరుతో బహిరంగంగా అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు స్కెచ్ కూడా వేసినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ భూమిని లాక్కుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు.తమ భూముల జోలికి రావొద్దని, వస్తే మరోసారి ఉద్యమిస్తామని ఆర్టీసీ సంఘాలు సైతం హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఇదిలాఉండగా, గతంలోనూ ఆర్టీసీ భూముల మీద రేవంత్ సర్కార్ కన్నుపడిందని కథనాలు వచ్చాయి.సంబంధిత రవాణా శాఖ మంత్రి అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేశారు.ఇదంతా విపక్షాలు చేస్తున్న కుట్ర అని చెప్పుకొచ్చారు. మరి తాజాగా జారీ చేసి జీవో నెంబర్ 206 సంగతి ఏంటని, దాని మీద సమాధానం చెప్పాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు అమ్మేస్తున్నారని, ఆర్టీసీ భూముల జోలికి మాత్రం రావొద్దని హెచ్చరికలు పంపారు. కాగా, మొన్నటివరకు రాష్ట్రంలోని పాలిటెక్నిక్ భూములపైనా ఇలాంటి వివాదమే నడిచింది.ఆ భూములను సొంతం చేసుకోవాలని రేవంత్ సర్కార్ చూడగా, విద్యార్థుల పోరు బాటతో వెనక్కి తగ్గిందని చర్చ జరిగింది.


