International

International: ప్రపంచానికి కొత్త టెన్షన్.. ఏఐ విస్తరణతో నీటి సంక్షోభం ముప్పు!?..

రచన: Venu7 నిమిషాల పఠనం

డేటా సెంటర్ల సామర్థ్యం పెరిగేకొద్దీ.. వాటి కూలింగ్ అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీకి చెందిన నిపుణుల అంచనా ప్రకారం.. 2030 నాటికి ప్రపంచ డేటా సెంటర్లకు సంబంధించిన నీటి ఫుట్‌ప్రింట్ ఏకంగా 9.3 ట్రిలియన్ లీటర్లకు చేరే అవకాశం ఉంది.

ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సినిమాల్లో మాత్రమే కనిపించే ఊహాజనిత ప్రపంచం.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనం ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. మన చుట్టూ ఏదో ఒక రూపంలో AI పనిచేస్తూనే ఉంది. మనం చూసే సోషల్ మీడియా పోస్టుల నుండి.. మనం వింటున్న పాటలు, చూస్తున్న వీడియోలు, షాపింగ్ చేసే వస్తువుల సూచనల వరకు.. AI ప్రభావం రోజువారీ జీవితంలోకి చొచ్చుకొచ్చింది.

ఒక్క ప్రశ్న అడిగితే పదుల్లో సమాధానం.. ఒక్క కమాండ్ ఇస్తే కొన్ని సెకన్లలో ఫొటో.. నిమిషాల్లో వీడియో.. వ్యాపారాల నుంచి విద్య వరకు, వైద్యం నుంచి వినోదం వరకు.. మనిషి చేసే ఎన్నో పనుల్లో AI భాగమవుతోంది. రాబోయే సంవత్సరాల్లో AI వినియోగం మరింత విస్తరించబోతోందని టెక్నాలజీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కొన్ని సెకన్ల AI వాడకం వెనుక వేలాది సర్వర్లు, శక్తివంతమైన కంప్యూటర్లు, కోట్లాది డేటా ఫైల్స్, విపరీతమైన విద్యుత్ వినియోగం.. వాటిని నిరంతరం చల్లగా ఉంచాల్సిన భారీ కూలింగ్ వ్యవస్థలు పనిచేస్తుంటాయి.

అంటే.. మనం AIని ఉపయోగించిన ప్రతిసారీ దాని వెనుక ఒక భారీ భౌతిక మౌలిక వ్యవస్థ మేల్కొంటుంది. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. AI డేటా సెంటర్లలోని శక్తివంతమైన చిప్స్, సర్వర్లు పనిచేసే సమయంలో విపరీతమైన వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఆ వేడిని నియంత్రించేందుకు ఉపయోగించే కొన్ని కూలింగ్ వ్యవస్థల్లో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. డేటా సెంటర్ల సామర్థ్యం పెరిగేకొద్దీ.. వాటి కూలింగ్ అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీకి చెందిన నిపుణుల అంచనా ప్రకారం.. 2030 నాటికి ప్రపంచ డేటా సెంటర్లకు సంబంధించిన నీటి ఫుట్‌ప్రింట్ ఏకంగా 9.3 ట్రిలియన్ లీటర్లకు చేరే అవకాశం ఉంది.

ఇది సబ్-సహారా ఆఫ్రికాలోని దాదాపు 130 కోట్ల మంది ప్రజల ప్రాథమిక వార్షిక గృహ నీటి అవసరాలకు సమానమని నివేదిక పేర్కొంటోంది. మరోవైపు ఒక సాధారణ ఏఐ ఇమేజ్ తయారీకి దాదాపు 29 మి.లీ నీరు ఖర్చవుతుండగా, కాంప్లెక్స్ వీడియోల తయారీకి సుమారుగా 4 లీటర్ల నీరు ఆవిరైపోతోంది. ఒక్కసారి కూలింగ్ కోసం వాడిన నీరు మళ్లీ వినియోగించడానికి వీలులేకుండా కలుషితమవుతుండటం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది.

ఇక టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు తమ డేటా సెంటర్ల కోసం స్థానిక జల వనరులను విపరీతంగా తోడేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లోని కొన్ని నగరాల్లో ఈ డేటా సెంటర్ల దాహానికి త్రాగునీటి సరఫరా సైతం దెబ్బతింటోందనే వార్తలు వస్తున్నాయి.. నదులు, భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒక నివేదిక ప్రకారం, ChatGPT లాంటి AI చాట్‌బోట్‌లో సుమారు 10 నుండి 50 ప్రశ్నలకు సమాధానాలు అడగడం ద్వారా అర్ధ లీటరు వరకు నీరు వినియోగమవుతుంది. ఈ నేపథ్యంలో ఏఐ అభివృద్ధిలో వేగం పెరిగేకొద్దీ.. ఈ నీటి వినియోగం కూడా భూమికి పెను భారంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరువు కాటకాలు, గ్లోబల్ వార్మింగ్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో.. ఏఐ దాహం సముద్రాలను కూడా ఎండగట్టేలా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ ఎంత పెరిగినా, వాడకం కూడా విపరీతంగా పెరగడం వల్ల ఈ జల సంక్షోభం మరింత తీవ్రరూపం దాలుస్తోందనే చర్చలు మొదలైయ్యాయి..

ఈ క్రమంలో టెక్నాలజీ కోసం మనుషుల దాహం తీర్చే నీటిని పణంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ఇక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రతిరోజూ AIని ఉపయోగిస్తే.. కొత్త డేటా సెంటర్లు నిర్మించాల్సి వస్తుంది. మరింత విద్యుత్ కావాలి. మరింత కూలింగ్ కావాలి. కొన్ని ప్రాంతాల్లో మరింత నీరు కూడా అవసరం అవుతుంది. ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో భారీ డేటా సెంటర్ల ఏర్పాటుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత కరువు పరిస్థితుల్లో డేటా సెంటర్ల స్థాపన వల్ల స్థానిక నీటి వనరులపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రపంచంలోని సముద్రాలు AI వల్ల ఎండిపోతున్నాయని చెప్పడం కాదు. ప్రపంచ నీటి సంక్షోభానికి AI ఒక్కటే కారణం కూడా కాదు. కానీ ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో AI ఆధారిత డేటా సెంటర్లు వేగంగా విస్తరిస్తే.. అదనపు ఒత్తిడి ఏర్పడే ప్రమాదం మాత్రం వాస్తవం అంటున్నారు. అందుకే భవిష్యత్తు AIదే కావచ్చు.. కానీ టెక్నాలజీ అభివృద్ధి కోసం.. మనిషి జీవించడానికి అవసరమైన నీటి కంటే AI విలువైనదిగా భావించకూడదని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు..

#International News#Data Centers#Water Issue#global concern#AI Technology#Google#Microsoft#Meta
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి