ఉదయాన్నే ఒక గ్లాస్ పండ్ల రసం తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, త్వరగా బరువు తగ్గొచ్చని చాలామంది భావిస్తారు. కొందరైతే బ్రేక్ ఫాస్ట్‌కు బదులుగా కేవలం జ్యూస్‌లతోనే కడుపు నింపేస్తుంటారు. కానీ పరగడుపున ఇలా జ్యూస్‌లు తాగడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నారింజ, బత్తాయి, ద్రాక్ష, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకున్నప్పుడు కడుపులో ఆమ్లత్వం విపరీతంగా పెరిగి గ్యాస్, తీవ్రమైన ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.
అలాగే వ్యాయామం చేసిన వెంటనే లేదా ఉదయాన్నే ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి జ్యూస్‌లు తాగడం. పరగడుపున అత్యంత చల్లని ద్రవాలు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థలోని శ్లేష్మ పొరలను ప్రభావితం చేసి, తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు..
ఇక బరువు తగ్గడం కోసం బ్రేక్ ఫాస్ట్ మానేసి జ్యూస్ తాగడం అస్సలు సరికాదని డైటీషియన్ చెబుతున్నారు.. పండ్లను నేరుగా తినడానికి, రసంగా తాగడానికి చాలా వ్యత్యాసం ఉంది. పండ్లను జ్యూస్ చేసినప్పుడు అందులోని అమూల్యమైన పీచు పదార్థం లేదా ఫైబర్ నశిస్తుంది. కేవలం షుగర్ మాత్రమే మిగలడం వల్ల, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచే ప్రమాదం ఉంది. పైగా ఫైబర్ లేకపోవడం వల్ల కడుపు త్వరగా ఖాళీ అయి మళ్లీ ఆకలి వేస్తుంది.
పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచివే, కానీ వాటిని తాగే సమయం, విధానం చాలా ముఖ్యం. ఉదయాన్నే పరగడుపున కాకుండా, బ్రేక్ ఫాస్ట్ చేసిన గంట తర్వాత లేదా మధ్యాహ్నం వేళల్లో జ్యూస్ తాగడం సురక్షితం. అలాగే ఫ్రిజ్ వాటర్ లేదా ఐస్ కాకుండా, సాధారణ ఉష్ణోగ్రతలో ఉండే జ్యూస్‌లను తీసుకోవడమే శరీరానికి పూర్తి పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.. అలాగే జ్యూస్‌ల కంటే నేరుగా పండ్లను తినడం వల్ల శరీరానికి ఫైబర్ తో పాటు పూర్తి పోషకాలు లభిస్తాయని సూచిస్తున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












