ఏపీ

‘జగన్ 2.0 చూపిస్తే.. మేం 10X చూపిస్తాం..’ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, విపక్ష వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, విపక్ష వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీరు 2.0 చూపిస్తామని బెదిరిస్తే.. మేం 10X (పదిరెట్లు) చూపిస్తాం’ అంటూ జగన్‌కు పవన్ కల్యాణ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలో మంగళవారం ఏర్పాటు చేసిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సంయుక్త మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు.

 జగన్ వైఖరిని ఎండగడుతూ పవన్ కల్యాణ్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలు ఇలాంటి బెదిరింపు ధోరణితో మాట్లాడటం వల్లే 2014, 2019 మరియు ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. జగన్ బెదిరింపులకు బెదిరిపోవడానికి ఎన్డీఏ కూటమిలో ఎవరూ సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. కేవలం తమ బలహీనతలను దాచుకోవడానికి మాత్రమే బలహీనులు ఇలాంటి భాషను మాట్లాడతారని, నిజమైన బలవంతులు ఎప్పుడూ ఇటువంటి వ్యాఖ్యలు చేయరని పవన్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లుగా జగన్ ముందుగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించి, సాధారణ జనజీవన స్రవంతిలోకి రావాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు.

 రాష్ట్రాభివృద్ధి , భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏ (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) కూటమిగానే ముందుకు సాగుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటి రాజకీయ సవాళ్లు వేరని, స్థానిక సంస్థల ఎన్నికల సవాళ్లు వేరని విశ్లేషించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పరిమిత స్థానాలకే జరిగిందని, కానీ స్థానిక ఎన్నికల్లో గ్రామ స్థాయి వరకు వేలాది స్థానాల్లో సీట్ల వికేంద్రీకరణ చేసుకోవడం కొంత క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ.. రాష్ట్రాభివృద్ధి కోసమే తాము కలిసి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

 ఇప్పటికే స్థానిక సంస్థల పోరులో తమ కూటమి తరఫున పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని డిప్యూటీ సీఎం ధీమా వ్యక్తం చేశారు.

#PawanKalyanCounterToJagan#APPolitics2026#PawanKalyan10XStatement#APDeputyCMPawanKalyan#YSRCPvsNDA#YSJaganVsPawanKalyan#APLocalBodyElections#AndhraPradeshNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి