తెలంగాణ

Harish Rao: కాంగ్రెస్ పాలనలో చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా? పనులు అవుతాయా? హరీశ్ రావు ఫైర్

రచన: NK•••16 నిమిషాల పఠనం

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు. కాంగ్రెస్ పాలనలో చచ్చిపోతేనే పనులు అవుతాయా? అంటూ ధ్వజమెత్తారు.

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు. కాంగ్రెస్ పాలనలో చచ్చిపోతేనే పనులు అవుతాయా? అంటూ ధ్వజమెత్తారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ను లక్ష కోట్ల అప్పుల్లో ముంచారని, 600 కోట్ల రూపాయల బియ్యాన్ని పందికొక్కుల పాలు చేశారని ఆరోపించారు. పెండింగ్ బిల్లుల కోసం తాను చనిపోవడానికీ సిద్ధమని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంటుంటే.. సమస్యల పరిష్కారం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజు అంటున్నారు. కాంగ్రెస్ రాజ్యంలో చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా? అంటూ విరుచుకుపడ్డారు హరీశ్ రావు.

లక్ష కోట్ల అప్పుల్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్

''సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాలతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రూ. లక్ష కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. 16 నెలలుగా గోదాములు, షాపుల్లో మూలుగుతున్న రూ.600 కోట్ల విలువైన దొడ్డు బియ్యాన్ని పురుగులు, పందికొక్కుల పాలు చేశారు. 100 కోట్లతో సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి, రూ. 18 కోట్లతో కాంపౌండ్ వాల్ కట్టడానికి, అందాల పోటీలకు, ఫుట్‌బాల్ షోకులకు డబ్బులుంటాయి కానీ.. 17,200 మంది డీలర్లకు నెలకు రూ. 10 కోట్లు గౌరవ వేతనం ఇవ్వడానికి పైసలు లేవా?'' అని హరీశ్ రావు ప్రశ్నించారు.

రేషన్ డీలర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బాగుపడలేదు

ఎన్నికల ముందు 5వేల రూపాయల గౌరవ వేతనం, 300 రూపాయల కమీషన్, మినీ సూపర్ మార్కెట్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకుని.. మూడేళ్లయినా కనీసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని హరీశ్ రావు విమర్శించారు. రేషన్ డీలర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని హెచ్చరించారు. తక్షణమే డీలర్ల సంఘాన్ని చర్చలకు పిలిచి హామీలు నెరవేర్చకపోతే అసెంబ్లీ, కౌన్సిల్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లోని బింగి ఎల్లయ్య గార్డెన్స్‌లో రాష్ట్రవ్యాప్త రేషన్ డీలర్ల సమావేశానికి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి తరలివచ్చిన రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రాణత్యాగానికైనా సిద్ధమనడం కదిలించింది

''రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజును గత 25ఏళ్లుగా చూస్తున్నా. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి సునీతా లక్ష్మారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డిని గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకుని డీలర్ల సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఎలా ఒప్పించాలో తెలిసిన నేర్పరి. డీలర్ల సమస్యలు పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, ప్రాణత్యాగానికైనా సిద్ధం అని నాయికోటి రాజు అనడం నన్ను కదిలించింది.

నిన్ననే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే, డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు అనిరుధ్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు. మంత్రుల నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయి. జడ్చర్లలో రోడ్లు పగుళ్లు పడ్డా 30-40 కోట్ల రూపాయల బిల్లులు రావడం లేదు. ఒక కాంట్రాక్టర్ చనిపోతేనే రూ.5 కోట్ల బిల్లు పడింది. నేను చచ్చిపోతేనే మా నియోజకవర్గ బిల్లులు వస్తాయంటే ప్రాణత్యాగానికి సిద్ధని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ రాజ్యంలో చచ్చిపోతేనే పనులు అవుతాయా? బిల్లులు వస్తాయా?

అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే.. చచ్చిపోతేనే పనులు అవుతాయా? చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా? అధికార పార్టీ ఎమ్మెల్యేనే చచ్చిపోవడానికి సిద్ధమనే దుస్థితి వచ్చింది. కానీ ఎవరూ చచ్చిపోవద్దు. అందరూ బాగుండాలి. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప. అందరం కలిసి గట్టిగా కొట్లాడి బిల్లులు, డీలర్ల కమీషన్ సాధించుకుందాం'' అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

మూడేళ్లలో అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు

''కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెల్లారే హామీలు అమలు చేయమని డీలర్లు అడగలేదు. కొత్త ప్రభుత్వం కుదురుకోవాలని ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు ఓపికగా ఎదురుచూశారు. కానీ మూడేళ్లు గడిచినా డీలర్ల వైపు కన్నెత్తి చూసే నాథుడే లేడు. కనీసం సివిల్ సప్లైస్ కమిషనర్ గానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని అధ్యక్షుడు రాజు బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి తమది ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటారు.

ప్రజలను ఎప్పుడైనా కలిసేదే ప్రజా ప్రభుత్వం. మరి 17,200 మంది రేషన్ డీలర్లు ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షుడికే మూడేళ్లలో అపాయింట్‌మెంట్ దొరకకపోతే ఇదెక్కడి ప్రజాపాలన?'' అని హరీశ్ రావు ప్రశ్నించారు.

''బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాయికోటి రాజు, నందయ్య తదితరులు వస్తే సచివాలయంలో రెండు రోజుల పాటు కూర్చోబెట్టి, భోజనం పెట్టి, నాటి మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి అధికారులను, కేసీఆర్ ని ఒప్పించి కమీషన్‌ను రూ.140కి పెంచాం. ఆరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ. 140 ఏం సరిపోతాయి, కనీసం రూ.300 ఇవ్వాలని మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఒక్కో డీలర్ వందలాది ఓట్లు వేయిస్తాడని జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్య, జీవన్ రెడ్డి వెళ్లి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుకి చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించారు.

డీలర్లు కాంగ్రెస్‌కు పని చేసి, ఓట్లు వేయించి గెలిపించారు

నెలకు 5వేల రూపాయల గౌరవ వేతనం, క్వింటాలుకు రూ.300 కమీషన్, రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చి అన్ని వస్తువులు అమ్ముకునే అనుమతి ఇస్తామని నమ్మబలికారు. ఆ మాటలు నమ్మి డీలర్లందరూ కాంగ్రెస్‌కు పని చేసి, ఓట్లు వేయించి గెలిపించారు. ఇవాళ డీలర్లు కొత్త డిమాండ్లేమీ పెట్టడం లేదు.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఆ మూడు హామీలనే అమలు చేయమని అడుగుతున్నారు.

కాంగ్రెస్ పాలనలో రేషన్ డీలర్ల కడుపు ఎండిపోతోంది

చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని కేసీఆర్ కొట్లాడి తెలంగాణ సాధించిన గజ్వేల్ గడ్డ మీద సమావేశం పెడితేనే ప్రభుత్వ పెద్దలకు సురుకు తగిలి కదలిక వస్తుందని ఇక్కడి నుంచే డీలర్లు సమరశంఖం పూరించారు. పేద ప్రజలందరికీ కడుపునిండా అన్నం పెడుతున్న రేషన్ డీలర్ల కడుపు మాత్రం కాంగ్రెస్ పాలనలో ఎండిపోతోంది. నాడు కేసీఆర్ పేదవాడు కడుపునిండా తినాలని మనిషికి 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలకు పెంచి, కార్డుకు 20 కిలోల సీలింగ్ ఎత్తేశారు. ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోల బియ్యం ఇచ్చారు. ఇవాళ డీలర్లకు రూపాయి కమీషన్ పెరగలేదు గానీ, నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి. మంచి నూనె రూ. 210, కందిపప్పు రూ.175, పెసరపప్పు రూ.130, ఉల్లిగడ్డ రూ.60 కి చేరింది, ఎల్లిగడ్డ ధర కొండెక్కింది. పన్నులు, అధికారుల వేధింపులు పెరిగిపోయి డీలర్లు కుటుంబాలను వెళ్లదీయలేని దుస్థితి నెలకొంది.

16 నెలలుగా ఆ బియ్యం ముక్కిపోయింది

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పడానికి దొడ్డు బియ్యం వ్యవహారమే నిదర్శనం. సన్నబియ్యం పంపిణీ మొదలుపెట్టాక, చిన్నగా ఉండే రేషన్ షాపుల్లో జాగా లేకపోయినా మూడు నెలల బియ్యం ఒకేసారి నిల్వ చేసి ఇవ్వమంటున్నారు. మరోవైపు గత 16, 17 నెలలుగా పాత దొడ్డు బియ్యం నిల్వలను అలాగే వదిలేశారు. గోదాములు, MLS పాయింట్లలో లక్ష మెట్రిక్ టన్నులు, రేషన్ షాపుల్లో 40 నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం మూలుగుతోంది. దీని విలువ అక్షరాలా రూ.600 కోట్లు. 16 నెలలుగా ఆ బియ్యం ముక్కిపోయి, ఎర్ర పురుగులు, లక్క పురుగులు పట్టి, ఎలుకలు, పందికొక్కులు తిని పిండిగా మారిపోయింది.

ఆ బియ్యాన్ని తింటే చావే..!

సిద్దిపేటలో ఒక రేషన్ షాపుకు వెళ్లి చూస్తే పురుగులు బయటకు పారుతున్నాయి. ఆ పాడైపోయిన బియ్యాన్ని మనుషులే కాదు, బయట పారబోస్తే తిన్న పశువులు, కుక్కలు కూడా విషతుల్యమై చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మిలిటరీలో పనిచేశానని గొప్పలు చెప్పుకునే మంత్రికి.. 16 నెలల క్రితమే ఆ బియ్యాన్ని వేలం వేసి అమ్మే కనీస తెలివి లేదా? ఆ బియ్యాన్ని అమ్మితే వచ్చే రూ.600 కోట్లతోనే డీలర్ల కమీషన్ పెంపు, గౌరవ వేతనం ఇచ్చేయవచ్చు కదా. తమ నిర్లక్ష్యంతో రూ. 600 కోట్ల ప్రజాధనాన్ని పందికొక్కుల పాలు చేయడమే కాకుండా.. ఇప్పుడు టెండర్లు పిలిచి 16 నెలల క్రితం షాపులో ఉన్న స్టాక్ లెక్క ప్రకారం తూకం వేసి ఇవ్వాలని డీలర్లను వేధిస్తున్నారు.

అసలే ఎంఎల్ఎస్ పాయింట్లలో తూకం తక్కువ వస్తుంటే, ఏడాదిన్నరగా ఎలుకలు, పురుగులు తిని తగ్గిన 5, 6 క్వింటాళ్ల తరుగును కూడా డీలర్లే జేబులోంచి కట్టాలనడం ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నేడు దాదాపు రూ. లక్ష కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. సన్న బియ్యం నిధులు, సన్న వడ్ల బోనస్ డబ్బులు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా కార్పొరేషన్‌కు విడుదల చేయకుండా కార్పొరేషన్‌నే అప్పులు తెచ్చుకోమంటోంది.

అందాల పోటీలకు, ఫుట్‌బాల్ షోకులకు నిధులు ఉంటాయి

గ్రామాల్లో మహిళలకు గ్యాస్ సబ్సిడీ ఒక నెల వేస్తే మూడు నెలలు ఎగ్గొడుతున్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బలంగా ఉంటేనే డీలర్లు బతుకుతారు. కార్పొరేషన్ దివాలా తీస్తే డీలర్లు కూడా ఆగమవుతారు. డీలర్లకు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అంటే అదీ కాదు. రూ.లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ, రూ.లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ, రూ.30 వేల కోట్లతో రోడ్లు అంటున్నారు. అందాల పోటీలకు, ఫుట్‌బాల్ షోకులకు నిధులుంటాయి. నాడు కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కడితే విమర్శించిన రేవంత్ రెడ్డి.. నేడు రూ. 100 కోట్లతో కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు, దాని కాంపౌండ్ వాల్‌కే రూ. 18 కోట్లు ఖర్చు పెట్టారు. మరి రాష్ట్రంలోని 17,200 మంది డీలర్లకు నెలకు రూ. 5,000 గౌరవ వేతనం ఇస్తే అయ్యే ఖర్చు నెలకు రూ. 10 కోట్లు కూడా కాదు. షోకులకు, క్యాంప్ ఆఫీసులకు వందల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి.. పేదల ఆకలి తీర్చే డీలర్లకు నెలకు రూ. 10 కోట్లు ఇవ్వడానికి మనసు రావడం లేదా?

డీలర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది

ఎన్టీఆర్ కాలం నుంచి చూస్తున్నాం.. రేషన్ డీలర్లు సైలెంట్ కిల్లర్లు. వారు బయటకు ఎక్కువగా మాట్లాడరు. కానీ, వారితో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ నిలబడలేదు. ప్రభుత్వం వారి శక్తిని తక్కువ అంచనా వేయవద్దు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి డీలర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని చర్చలకు పిలవాలి. డీలర్లపై వేధింపులు ఆపి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన రూ. 5,000 గౌరవ వేతనం, రూ. 300 కమీషన్, మినీ సూపర్ మార్కెట్ల హామీలను వెంటనే అమలు చేయాలి. డీలర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉండి అసెంబ్లీలో, మండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది'' అని హరీశ్ రావు అన్నారు.

#Harish Rao#Brs#Telangana#Civil Supplies#Ration Dealers#Cm Revanth Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి