Sweets: పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. నెయ్యి సువాసనలు వెదజల్లే రంగురంగుల మిఠాయిలను లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటాం. బ్రాండెడ్ షాపు కదా, వేల రూపాయలు పెట్టి కొంటున్నాం కదా అని గుడ్డిగా నమ్ముతుంటాం. కానీ ఆ మెరిసే ప్యాకింగ్‌ల వెనుక, ఆ ఘుమఘుమలాడే నెయ్యి వాసనల వెనుక ఎంతటి కాలకూట విషం దాగుందో తెలిస్తే కడుపులో తిప్పడం ఖాయం. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేందుకు హైదరాబాద్ నగరంలోని పేరుమోసిన స్వీట్ దుకాణాలు, తయారీ కేంద్రాలు ప్రజారోగ్యంతో ఎంతలా చెలగాటమాడుతున్నాయో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో బట్టబయలైంది.
కిచెన్లలో ఎలుకల విసర్జితాలు.. స్వీట్లపై
ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్ పరిధిలోని ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు జీడిమెట్ల, కూకట్పల్లి, మాసబ్‌ట్యాంక్, చందానగర్, బేగంబజార్ వంటి పలు ప్రాంతాల్లోని స్వీట్ తయారీ కేంద్రాల్లో సోదాలు నిర్వహించాయి. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి అధికారులే విస్తుపోయారు. ఏ ఒక్క చోటా కనీస పరిశుభ్రత లేదు. నేలంతా దెబ్బతిని మురుగునీరు, వ్యర్థాలు పేరుకుపోయాయి. స్వీట్ల తయారీ గదుల్లో కిటికీలకు మెష్‌లు లేకపోవడంతో ఈగలు, ఎలుకలు, బొద్దింకలు విచ్చలవిడిగా ఆహార పదార్థాలపై తిరుగుతున్నాయి. పిండి, పప్పులు బూజుపట్టి పురుగులు పట్టి ఉండగా.. ఎలుకల మల విసర్జితాలు కనిపించాయి. అంతేకాదు, స్వీట్లు తయారు చేసే ప్రాంతాల్లో బీడీలు, గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లు కనిపించడం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఎక్స్పైరీ స్వీట్లకు రంగుల మాయ..
అమ్ముడుపోకుండా డేట్ అయిపోయిన పాత స్వీట్లకు మళ్లీ కెమికల్స్, రంగులు కలిపి ఫ్రెష్ స్వీట్లుగా మార్చి అమ్ముతున్న దారుణమైన మోసాలు వెలుగుచూశాయి. అటు స్వచ్ఛమైన నెయ్యి, పన్నీర్ పేరిట మార్కెట్లోకి వస్తున్న సరుకులో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు తేలింది. పన్నీర్ గట్టిదనం కోసం అనుమతి లేని లూజ్ పామాయిల్, గ్లిజరాల్ మోనోస్టెరేట్ వంటి కెమికల్స్ వాడుతున్నారు. మహారాష్ట్ర, యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి నాసిరకం మిల్క్ క్రీమ్ తెప్పించి, ల్యాబ్ టెస్టుల్లో కూడా దొరకకుండా రసాయనాలు కలిపి '100% ప్యూర్ ఘీ', 'ఫార్మ్ ఫ్రెష్ ఘీ' పేరిట కల్తీ నెయ్యిని మార్కెట్లోకి వదులుతున్నారు.
టాప్ బ్రాండ్ల లైసెన్సులు రద్దు..
ఈ తనిఖీల్లో తీవ్ర రూల్స్ బ్రేక్ చేసిన కూకట్‌పల్లిలోని వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్, మాసబ్‌ట్యాంక్‌లోని మధుర్ స్వీట్స్, చందానగర్‌లోని బిచ్చారెడ్డి స్వీట్స్, జీడిమెట్లలోని భాగ్యలక్ష్మి స్వీట్స్, బాలాజీ మ్యాజిక్ మిఠాయి, యశోద డైరీ సహా పలు సంస్థల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. ఆల్మండ్ హౌస్, దాదూస్ మిఠాయి వాటిక, రాజీవ్ రెడ్డి స్వీట్స్, పరుచూరి ఫుడ్స్, హనీ ఫుడ్స్, సుదర్శన్ రెడ్డి స్వీట్స్ వంటి ప్రముఖ సంస్థలకు భారీ పెనాల్టీలు విధించేందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. లక్షల రూపాయల విలువైన కల్తీ కోవా, నాసిరకం నెయ్యి, రసాయనాలను అధికారులు సీజ్ చేశారు. బయటి తినుబండారాలు తిని వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో.. స్వీట్లు, పాల ఉత్పత్తులు కొనేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


