Mythri Ravi: మన టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం అన్నీ రకాల జానర్..అన్నీ రకాల బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ విజయ పంథాలో కొనసాగుతున్నారు. ఇరుముడి సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్న ఈ సంస్థ, తాజాగా రణబాలి మూవీతోను మరో హిట్ అందుకున్నట్టుగా నిర్మాత వెల్లడించాడు. దీన్నిబట్టి, హీరో విజయ్ దేవరకొండ ఖాతాలో విజయం చేరినట్టే.
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నటుడిగా తెలుగు తెరకి పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమా డీసెంట్ హీరోగా నిలబెడితే, అర్జున్ రెడ్డి ఏకంగా రౌడీ హీరో ఇమేజ్ను తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి టాలీవుడ్లో విజయ్‌ని రౌడీ హీరో అని ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. ఇక, గీత గోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ఆ తర్వాత చేసిన టాక్సీవాలా మంచి హిట్ సినిమాగా నిలిచింది.
కానీ, డియర్ కామ్రేడ్ సినిమా నుంచి గత చిత్రం కింగ్డం వరకూ మళ్ళీ హిట్ ఎలా ఉంటుందో చూడలేకపోయాడు విజయ్. 14 సినిమాలు చేసిన ఈ హీరోకి రణబాలి మూవీ చాలా ప్రత్యేకం అని చెప్పాలి. మొదటిసారి పీరియాడిక్ సినిమాను చేయడం, భారీ బడ్జెట్‌తో మైత్రీ వారు నిర్మించడం, విజయ్-రష్మిక పెళ్లి తర్వాత రిలీజైన మొదటి సినిమా కావడం..ఇలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అయితే, రణబాలి చిత్రానికి మొదటి రోజు నుంచి కాస్త డివైడ్ టాక్ వచ్చింది. దీంతో, సినిమా ఫ్లాపైందనే ప్రచారం జరుగుతోంది.
ఓవరాల్‌గా రణబాలి 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని డెడ్‌లైన్ ఉంది. మరి, ఆ డెడ్‌లైన్‌ను రణబాలి చేరుకుందా లేదా..అంటే, తాజాగా నిర్మాతలలో ఒకరైన యలమంచిలి రవి శంకర్..చాలా చోట్ల రణబాలి బ్రేకీవెన్ అయిందని క్లారిటీ ఇచ్చాడు. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ అనే వెల్లడించాడు. మరి, ఇందులో ఎంతవరకూ నిజముందో గానీ..విజయ్ కెరీర్లో మాత్రం రణబాలి ప్రత్యేకమైన చిత్రంగానే చెప్పుకోవాలి. నిర్మాత మాటల్లో గనక నిజముంటే గ్యారెంటీగా రణబాలి హిట్ సినిమాల లిస్ట్‌లో చేరుతుంది.


