రాష్ట్రంలో పీడీఎస్ రైస్ పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై తెలంగాణ ప్రభుత్వం కొరఢా ఝలిపించింది.కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరాలో భారీ అక్రమాలు జరిగాయని అధికారులు విచారణలో తేల్చడడంతో రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగారు. ఇప్పటివరకు దాదాపు 150 మందికిపైగా రైస్ మిల్లర్లను అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
ఆదివారం ఉదయం 5 గంటల నుంచే సీఐడీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అలాగే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నలుగురు రైస్ మిల్లు యజమానులను అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. ఎవరైతే అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ మిల్లర్లను సైతం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సన్నబియ్యానికి బదులు దొడ్డుబియ్యం..
రాష్ట్ర ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు నిబంధనల అతిక్రమించి నాణ్యమైన సన్న బియ్యానికి బదులుగా దొడ్డు బియ్యాన్ని సరఫరా చేశారని ప్రధాన ఆరోపణలున్నాయి.దీనికి తోడు సీఎంఆర్ ధాన్యాన్ని సైతం పక్కదారి పట్టించి ప్రభుత్వానికి రూ. వేల కోట్లు నష్టం కలిగించారని సైతం ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీఐడీ అధికారులు తీవ్రస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి 150 మందికి పైగా మిల్లర్లను అరెస్ట్ చేయడంతో రైస్ మిల్లర్ల వర్గాల్లో తీవ్ర అలజడి నెలకొంది.
కస్టమ్ మిల్లింగ్, పీడీఎస్ రైస్ కుంభకోణం వెనుక ఉన్న అధికారులు, వ్యాపారుల పాత్రపై కూడా సీఐడీ పూర్తిస్థాయిలో లోతుగా విచారణ జరుపుతోంది.ఇటీవలి కాలంలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్టు పెద్దఎత్తున కథనాలు రావడం, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి పీడీఎస్ రైస్ టన్నుల కొద్దీ పక్కదారి పడుతున్నట్టు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు ముమ్మరం చేయగా తాజాగా సీబీ సీఐడీ రంగంలోకి దిగి అక్రమార్కులను అరెస్టు చేసింది.మరికొందరిని కూడా త్వరలోనే అరెస్టు చేయనున్నట్టు సమాచారం.


