Revanth Reddy: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న చిక్కుముడులను విప్పేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబై బయలుదేరనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్న సీఎం, సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో అత్యంత కీలకమైన చర్చలు జరపనున్నారు.
సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో హై-లెవల్ భేటీ
సోమవారం ఉదయం 11 గంటలకు ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన కీలక ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. సరిహద్దు ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఈ సమావేశం కీలకంగా మారనుంది.
తుమ్మిడిహట్టిపైనే ప్రధాన చర్చ
ఈ పర్యటనలో ప్రధాన అజెండా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణమే. గతంలో ఈ బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రాంతాలు, నీటి కేటాయింపులపై మహారాష్ట్ర కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేలా, మహారాష్ట్ర సర్కారును ఒప్పించి ప్రాజెక్టును త్వరితగతిన పట్టాలెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం బలమైన ప్రతిపాదనలతో సిద్ధమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులకు సాగునీరు అందించేందుకు తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ తెలుగు నాట రాజకీయంగా, పరిపాలనాపరంగా తీవ్ర ఆసక్తి రేపుతోంది.


