Venu Sriram: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడు ఎప్పుడు ఫేడవుట్ అవుతున్నాడో చెప్పలేకపోతున్నాము. ఒక సినిమా హిట్ అయితే హీరోలు కథ చెప్పమంటారు. నిర్మాతలు అడ్వాన్స్ ఇస్తారు. అదే, నిర్మాత.. అదే దర్శకుడికి ఒక ఫ్లాప్ వస్తే ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసేసుకుంటాడు. హీరోలు కూడా కనీసం కథ వినే టైమ్ ఇవ్వకుండా ఎస్కేప్ అవుతుంటారు. అలాంటి, దర్శకుల్లో వేణు శ్రీరామ్ కూడా ఉన్నారు. వకీల్ సాబ్ లాంటి భారీ హిట్ తర్వాత తమ్ముడు ఫ్లాప్‌తో మళ్ళీ ఏంచేస్తున్నాడో తెలియలేదు.
వేణు శ్రీరామ్ కి నిర్మాత దిల్ రాజుకి మంచి బాండింగ్ ఉంది. ఆయన సంస్థ నుంచే ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2011లో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు వేణు. ఆ తర్వాత, నేచురల్ స్టార్ నాని హీరోగా మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను తీశాడు. ఈ సినిమా యావరేజ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ముగిసింది. ఆ తర్వాత చాలా ఏళ్ల గ్యాప్..
మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి అఫీషియల్ తెలుగు రీమేక్. ఇదే సినిమాను తమిళంలో అజిత్ చేశాడు. హిందీలో అమితాబ్ ఇమేజ్ కి తగ్గట్టుగా తీసిన సినిమాను తమిళంలో అజిత్ కుమార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా హెచ్.వినోద్ మార్పులు చేసి తీయగా అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇదే, సినిమా పవన్ చేయడం విశేషం.
ఒకరకంగా, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వకీల్ సాబ్ ప్రయోగమే అని చెప్పాలి. ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా వేణు శ్రీరామ్ అదనపు హంగులను జోడించి తీసిన వకీల్ సాబ్ భారీ హిట్‌గా నిలిచింది. కానీ, నితిన్‌తో తీసిన తమ్ముడు సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ సెట్ అవడానికి చాలా సమయం పట్టింది. వాస్తవానికి, కరోనా సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఐకాన్ అనే టైటిల్‌తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ, అది పక్కన పెట్టారు. ప్రస్తుతం, మంచి కథ తయారు చేసుకునే పనిలో ఉన్నాడు వేణు.
దిల్ రాజు నిర్మాణంలో త్వరలోనే ప్రాజెక్ట్ ప్రకటించనున్నాడని సమాచారం. అన్నట్టు, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే..ప్రముఖ సినిమాటోగ్రాఫర్, నటులు మీర్ గారు..వేణు శ్రీరామ్ మంచి మిత్రులు. ఇంకా, గొప్పగా చెప్పాలంటే..మీర్ గారిని ఆయన గురువు సమానులుగా భావిస్తుంటారు. ఆ అభిమానంతోనే వకీల్ సాబ్ మూవీలో జడ్జ్ పాత్రను చేయించారు వేణు. ఇందుకుగానూ, పలు ఇంటర్వ్యూలలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు మీర్ గారు.


