తెలంగాణ

TG: కాలం చెల్లిన ఏపీఐలను పీకేయండి: సీపీ సజ్జనార్

4 నిమిషాల పఠనం

TG: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో యూజ్‌లో లేని పాత ఏపీఐలను (Application Programming Interface), కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్లను తక్షణమే తొలగించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు.

TG: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో యూజ్‌లో లేని పాత ఏపీఐలను (Application Programming Interface), కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్లను తక్షణమే తొలగించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు. ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సంస్థల భద్రతా వ్యవస్థల్లోని లోపాలే నేరగాళ్లకు ప్రధాన ఆయుధాలుగా మారుతున్నాయని ఆయన హెచ్చరించారు. పాత ఏపీఐల గుండానే హ్యాకర్లు వ్యవస్థల్లోకి చొరబడుతున్నారని, వెంటనే వాటిని తొలగించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.

ఏఐ ఏజెంట్ల డేంజర్ బెల్స్..

సైబర్ ముఠాలు అత్యాధునిక ‘ఏఐ ఏజెంట్ల’ను ప్రయోగించి ఆర్థిక సంస్థల నెట్‌వర్క్‌లను జల్లెడ పడుతున్నాయని సీపీ వివరించారు. చాలా సంస్థలు పాత ఏపీఐ సర్వీసులను, అన్‌సెక్యూర్డ్ థర్డ్ పార్టీ మాడ్యూళ్లను అలాగే వదిలేస్తుండటంతో.. హ్యాకర్లు ఆ లోపాలను క్షణాల్లో పసిగడుతున్నారు. పేమెంట్ గేట్‌వేలను బురిడీ కొట్టించి, అక్రమంగా నిధులను మ్యూల్ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ తరహా నిధుల లూటీకి అడ్డుకట్ట వేయాలంటే వాడకంలో లేని ప్రతి పాత ఏపీఐని వ్యవస్థల నుంచి పూర్తిగా డిలీట్ చేయాలని, నగదు బదిలీ వ్యవస్థలకు అత్యున్నత ఎన్‌క్రిప్షన్ భద్రత కల్పించాలని ఆయన సూచించారు.

భద్రతా చర్యలపై సీపీ సజ్జనార్ మార్గదర్శకాలు

సైబర్ ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు సంస్థలకు సీపీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వాడుకలో లేని, భద్రతా ప్రమాణాలు లేని అన్ని పాత ఏపీఐ మాడ్యూళ్లను సిస్టమ్స్ నుంచి వెంటనే తొలగించాలన్నారు. అలాగే నగదు బదిలీ చేయడానికి ముందే ఖాతాదారుల పూర్తి స్థాయి కేవైసీని తప్పనిసరిగా ధ్రువీకరించాలని చెప్పారు. సాధారణ పరిమితికి మించి అనుమానాస్పదంగా జరిగే లావాదేవీలను ఆటోమేటిక్‌గా పసిగట్టే వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ మొత్తంలో క్యాష్ బయటకు వెళ్లే టైంలో ఉన్నతాధికారుల ఫర్మిషన్స్ ఉంటేనే ఫండ్స్ రిలీజ్ అయ్యేలా రూల్స్ పెట్టాలని అన్నారు. తమ సెక్యూరిటీ నెట్‌వర్క్ ఎంత పటిష్ఠంగా ఉందో పరీక్షించుకునేందుకు ఐటీ, సైబర్ సెక్యూరిటీ బృందాలతో ఎప్పటికప్పుడు రెడ్ టీమ్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు. ఒకవేళ ఏ సంస్థ లేదా వ్యకి అయినా సైబర్ మోసానికి గురైతే వెంటనే ‘గోల్డెన్ అవర్’లో 1930 హెల్ప్‌లైన్‌కు డయల్ చేయాలని, లేదంటే cybercrime.gov.in పోర్టల్‌లో కంప్లైంట్ ఫైల్ చేయాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

#Hyderabad Police#CP VC Sajjanar#Telangana Police#Cyber Security#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి