Gold Rate India: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పరుగుకు ఊహించని బ్రేకులు పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు భారీగా కుప్పకూలుతున్నా.. భారత్‌లో మాత్రం బంగారం తన ‘రాయల్ లుక్’ను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. గ్లోబల్ మార్కెట్లో బంగారం విలువ ఏకంగా 24 శాతం మేర పతనమైనప్పటికీ, మన దేశంలో ఆ స్థాయిలో తగ్గుదల నమోదు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రపంచ మార్కెట్లలో ధరలు నేలచూపులు చూస్తున్నా, భారతీయ కొనుగోలుదారుడికి మాత్రం పసిడి చౌకగా మారకపోవడం వెనుక పెద్ద ఆర్థిక సమీకరణాలే దాగున్నాయని అంటున్నారు. అవి ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
ఆకాశం నుంచి అగాధంలోకి..
2026 ప్రారంభంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, జనవరి 29న అంతర్జాతీయ మార్కెట్లో సరికొత్త జీవితకాల రికార్డును తాకింది. అప్పట్లో ఔన్స్ బంగారం ధర రికార్డు స్థాయిలో 5,379 డాలర్లకు చేరింది. అయితే ఆ తర్వాత మార్కెట్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి మొదలవడంతో ధరలు క్రమంగా దిగివచ్చాయి. నవంబర్ 6 నాటికి ఔన్స్ పసిడి ధర 4,068.71 డాలర్ల స్థాయికి పడిపోయింది. జనవరి నాటి ఆల్-టైమ్ హైతో పోలిస్తే ఇది ఏకంగా దాదాపు 24 శాతం పతనం.
అదే సమయంలో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరల్లో కరెక్షన్ కనిపించింది. జనవరితో పోలిస్తే ఇక్కడ ధరలు సుమారు 20 శాతం వరకు తగ్గినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన భారీ ఊరట భారతీయ వినియోగదారుడికి పూర్తిగా దక్కలేదు.
భారత్‌లో రేటు ఎందుకు తగ్గడం లేదంటే..
గ్లోబల్ మార్కెట్‌తో పోలిస్తే మన దేశంలో బంగారం ధరలు అంతగా దిగిరాకపోవడానికి రెండు కీలక అంశాలు అడ్డుగోడగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. జనవరిలో బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకం 6 శాతంగా ఉండేది. అయితే మే 13న కేంద్ర ప్రభుత్వం దీనిని ఏకంగా 15 శాతానికి పెంచేసింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధరల ఫలితాన్ని ఈ భారీ సుంకం పెంపు దాదాపు మింగేసింది.
బంగారం కొనుగోళ్లు అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్లలోనే జరుగుతాయి. జనవరి గరిష్టాలతో పోలిస్తే డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ఇప్పటికీ దాదాపు 2 శాతం బలహీనంగానే ఉంది. రూపాయి విలువ పడిపోవడంతో దేశంలోకి దిగుమతి చేసుకునే ఖర్చు పెరిగి, రిటైల్ మార్కెట్లో రేట్లు ఎక్కువగా కొనసాగేలా చేసింది.
పసిడి ఇప్పటికీ ప్రియమే
అంతర్జాతీయంగా రేట్లు తగ్గాయని సంబరపడే పరిస్థితి సామాన్యుడికి కనిపించడం లేదు. ఏడాది కాలం లెక్కలు తీస్తే పసిడి కొనుగోలుదారులకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. గత ఏడాది దంతేరాస్ పండుగ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 32,400 గా నమోదవగా, ప్రస్తుతం అది రూ. 46,300 వద్ద కొనసాగుతోంది. అంటే ఏడాది వ్యవధిలో చూస్తే పసిడి ధరలు ఇప్పటికీ దాదాపు 10 శాతం అధికంగానే ఉండటం గమనార్హం.
వెండి పరిస్థితి మరింత పతనం
పసిడితో పాటే వెండి మార్కెట్ కూడా అంతర్జాతీయంగా అనూహ్య పతనాన్ని చవిచూసింది. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు చూస్తే వెండి ధర ఏకంగా 57 శాతం మేర పతనమై 52 డాలర్ల స్థాయికి పడిపోయింది. అయితే వెండిపై కూడా ప్రభుత్వం మే నెలలో దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచడంతో పాటు, సిల్వర్ బార్ల దిగుమతులపై పలు పరిమితులు విధించడంతో దేశీయ మార్కెట్లో ఆ స్థాయిలో ప్రయోజనం కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్లు పతనం బాట పట్టినప్పటికీ, భారత్‌లో అమలవుతున్న దిగుమతి సుంకాలు, బలహీన రూపాయి కారణంగా పసిడి తన డిమాండ్‌ను, ధరల రాయల్ లుక్‌ను పదిలంగానే కాపాడుకుంటోందని అంటున్నారు.


