Movie Updates: భారీ అంచనాలు.. వేల కోట్ల బడ్జెట్ ప్రచారం.. ఇదంతా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'రామాయణ' సినిమా గురించి
చెప్పాలంటే. ఈ సినిమా ఒకవైపు ఉంటే, మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'సీన్' సినిమా పోటీలో నిలిచింది. సూర్య
కూడా తనదైన శైలిలో బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతున్నాడు. ఇంకా, రజినీకాంత్ జైలర్ 2 సినిమా థియేటర్స్‌లో సందడి చేస్తోంది.
రామాయణ..ఇలా భారీ చిత్రాల పోటీ ఉన్నప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ సూర్య తన స్టార్‌డమ్‌ను మరోసారి
నిరూపించుకుంటున్నారు.
రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన 'రామాయణ: పార్ట్
1' నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాతరోజే అంటే నవంబర్ 6న సూర్య నటించిన 'సీన్' విడుదలైంది. భారీ
ప్రచారం, పాన్ ఇండియా క్రేజ్‌తో రామాయణం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సమయంలో 'సీన్' విడుదల కావడం ఆసక్తికరంగా
మారింది.
అయితే, రామాయణం వంటి భారీ చిత్రంతో పోటీ ఉన్నప్పటికీ 'సీన్' సినిమా తనకంటూ ప్రత్యేకమైన ప్రేక్షకులను థియేటర్స్‌కి
రప్పిస్తోంది. తాజాగా అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'సీన్' సినిమాకు ఆదివారం బుక్‌మైషోలో సుమారు 5.16
లక్షల టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్
మార్కును దాటినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది కేవలం స్టార్ హీరో క్రేజ్ మాత్రమే కాదు.. ప్రేక్షకుల్లో సినిమాపై ఏర్పడిన
అంచనాలు.
'ఆవేశం', 'రోమాంచం' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ జీతూ మాధవన్ ఈ సినిమాకు దర్శకత్వం
వహించారు. ఇందులో, సూర్యతో పాటు నజ్రియా నజీమ్, నస్లెన్ కీలక పాత్రల్లో నటించారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ
సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒకవైపు భారీ బడ్జెట్, మరోవైపు స్టార్ కాస్ట్, ఇంకోవైపు భారీ ప్రచారం.. ఇవన్నీ
ఉన్నప్పటికీ చివరకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేది కథ, కథనం, వినోదం అనే విషయాన్ని 'సీన్' మూవీ మరోసారి
నిరూపించింది. రామాయణం వంటి భారీ చిత్రంతో పోటీ ఉన్నా సూర్య సినిమా వెనక్కి తగ్గకుండా దూసుకెళ్తుండటం సినీ వర్గాల్లో
చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి, సూర్య ఈ ఏడాదిలో మూడవ బ్లాక్ బస్టర్ అందుకొని హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు.


