తెలంగాణ

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలుశిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు

4 నిమిషాల పఠనం

న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను బేఖాతరు చేసిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిర్ధారించింది జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం.

న్యాయస్థానం ఉత్తర్వులు బేఖాతరు

ఐఏఎస్ తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

6 నెలల సాధారణ కారాగారం, 2వేలు జరిమానా

TG: న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను బేఖాతరు చేసిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిర్ధారించింది జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డికి 6 నెలల సాధారణ జైలుశిక్షతో పాటు 6 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది.

ఉల్లంఘనపై విచారణ.. సంచలన తీర్పు

న్యాయస్థానం ఆదేశించిన సమయంలో స్పందించకుండా పిటిషన్ దాఖలయ్యాక నామ మాత్రంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు.. కలెక్టర్ నారాయణరెడ్డి ఉద్దేశపూర్వకంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారించింది. ఐఏఎస్ స్థాయి అధికారి కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేయడం సరికాదని ధర్మాసనం కఠిన నిర్ణయం తీసుకుంది.

అసలేం జరిగిందంటే..

రిజిస్ట్రేషన్ చట్టం 1908 లోని సెక్షన్ 22 ఏ ప్రకారం నిషేధిత ఆస్తులు జాబితా నుంచి కొన్ని ప్లాట్లను తొలగించాలంటూ బాధితులు దాఖలు చేసిన వినతిని పరిశీలించాలని కలెక్టర్ ను గతంలో హైకోర్టు ఆదేశించింది. 2025 ఆగస్టులో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే కోర్టు నిర్దేశించిన 60 రోజుల గడువు ముగిసినప్పటికీ కలెక్టర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో బాధితులు 2025 అక్టోబర్ 15న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ నమోదైన తర్వాత యంత్రాంగం కదిలింది. అధికారులు బాధితులకు నోటీసులు జారీ చేసి 2026 ఫిబ్రవరి 26న వారి వినతి తిరస్కరించారు. ఆ తర్వాత జూలై 8న మరోసారి తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేశారు.

కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైన తర్వాతే అధికారులు స్పందించడం, కోర్టు ఆదేశించిన గడువులోగా నిర్ణయం తీసుకోకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను కలెక్టర్ ఉల్లంఘించారని నిర్ధారించింది. ఐఏఎస్‌ స్థాయి అధికారి న్యాయస్థానం ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం సమర్థనీయం కాదంటూ సీరియస్ అయ్యింది. 6 నెలల జైలు శిక్ష విధించింది. కలెక్టర్ కు జైలుశిక్ష విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. అధికారవర్గాల్లో సంచలనంగా మారింది.

#TG#Telangana High Court#Jail#Court Contempt#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి