Farmers Protest: తెలంగాణలో సాగునీటి కష్టాలు పెరుగుతున్నాయి. సాగునీటి కోసం అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికి అందివచ్చిన పంట.. నీరు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కారు. జన్నారం మండలం తపాలాపూర్ అటవీ చెక్ పోస్ట్ సమీపంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాంపూర్, తపాలాపూర్, తిమ్మాపూర్, తాలపేట రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు ధర్నా చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
మరో 15 రోజులు నీరు ఇవ్వాలని డిమాండ్
కడెం ప్రాజెక్ట్ నుంచి నీరు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడెం ప్రాజెక్ట్ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వరి పంట పొట్ట దశలో ఉందని.. మరో 15 రోజులపాటు ఉన్న కడెం ప్రాజెక్ట్ నుంచి సాగునీరు అందితేనే వరి సాగు అవుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో నీరు ఆపేస్తే.. తాము తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
తాగునీటి పేరుతో కుట్రలు.. పరిశ్రమలు, బీర్ల ఫ్యాక్టరీలకు తరలింపు?
కళ్ల ముందు చేతికి వచ్చిన పంట చేజారిపోతే ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కడెం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా.. తాగునీరు పేరుతో నీటిని నిలిపివేసి రైతులను వేధించడం సరికాదన్నారు. రేవంత్ ప్రభుత్వం తాగునీటి పేరుతో పరిశ్రమలకు, బీర్ల ఫ్యాక్టరీలకు నీళ్లు సరఫరా చేసే దురాలోచనతో ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగునీరు విడుదల చేయాలన్నారు.
మా నీళ్లు మాకు కావాలి
''కడెం ప్రాజెక్ట్ లో నిండా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళను హైదరాబాద్ లోని బీర్ల ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నీళ్లు మాకు కావాలి. ఇవాళ ఈ ప్రాంతంలోని వరి మొక్క ఆక్సిజన్ మీదుంది. నీటి విడుదల విషయంలో రేపు మీటింగ్, ఎల్లుండి మీటింగ్ అంటూ దాదాపు 10 రోజులు గడిపేశారు. ఇంకా ఇవాళ కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఈ వరిని కాపాడాలంటే తక్షణమే మాకు నీటిని విడుదల చేయాలి. అప్పుడే మా ఆందోళన విరమిస్తాం. అంతే తప్ప మీ హామీలకు మేము తలొగ్గే ప్రసక్తి లేదు. కచ్చితంగా ఈ నెల లాస్ట్ వరకు మాకు నీళ్లు ఇవ్వాల్సిందే. లేని పక్షంలో ఈ ఆందోళన ఉధృతం చేస్తాం'' అని రేవంత్ సర్కార్ ను హెచ్చరించారు రైతులు.
3 అడుగుల నీరు ఇస్తే చాలు..
''కడెం ప్రాజెక్టు ఆయకట్టు కింద 68వేల ఎకరాల భూములు సాగు అవుతాయి. 68వేల ఎకరాల ఆయకట్టుకు గాను కడెం ప్రాజెక్టులో నిండుగా నీళ్లు ఉన్నాయి. కడెం ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 700 అడుగులు. ప్రస్తుతం 693 అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నాయి. కాలువ కంటే 18.5 అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నాయి. కేవలం 693 అడుగుల నీటిలో 3 అడుగుల నీరు మాత్రమే ఇస్తే ఈ నెల చివరికల్లా పంటలు పూర్తిగా పండుతాయి. 68వేల ఎకరాల ఆయకట్టులో పంట పొట్ట దశలో ఉంది. ఇప్పుడు కనుక నీళ్లు బంద్ చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. వందల కోట్లు నష్టం వస్తుంది. ఈ నెల 10వ తేదీ నుంచి నీళ్లు బంద్ చేయాలని చెప్పారు. తాగునీటి పేరుతో సుదూర ప్రాంతాలకు నీటిని తరలించే కుట్ర జరుగుతోంది'' అని రైతులు ఆరోపించారు.


