తెలంగాణ

Telangana Congress: కాంగ్రెస్‌లో ‘మునుగోడు’ మంటలు.. హస్తం పార్టీలో హాట్ టాపిక్‌గా రాజగోపాల్ రెడ్డి!

7 నిమిషాల పఠనం

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరి మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. గత కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న ఈ సీనియర్ నేత, ఒక్కసారిగా సొంత పార్టీ సర్కార్‌పైనే అసంతృప్తి స్వరం వినిపించడం గాంధీభవన్‌ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరి మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. గత కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న ఈ సీనియర్ నేత, ఒక్కసారిగా సొంత పార్టీ సర్కార్‌పైనే అసంతృప్తి స్వరం వినిపించడం గాంధీభవన్‌ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మంత్రుల నియోజకవర్గాలకే నిధులు తరలిపోతున్నాయని, సాధారణ శాసనసభ్యులకు మొండిచేయి చూపిస్తున్నారంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలను రచ్చకెక్కించాయి. దీంతో హస్తం గూటిలో ఇప్పుడు ‘మునుగోడు’ మంటలు ఏ స్థాయికి చేరతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

నిధుల కేటాయింపుపై నిలదీత.. ఉత్తమ్‌పై గురి

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానమే అయినప్పుడు కొన్ని నియోజకవర్గాలకు నిధులు వరదలా పారడం, మరికొన్ని ఎడారిలా మిగిలిపోవడం ఏంటని రాజగోపాల్ రెడ్డి సూటిగా ప్రశ్నించడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. "అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా నా నియోజకవర్గ అభివృద్ధికి పైసలు అడుక్కోవాలా?" అంటూ ఆయన వ్యక్తం చేసిన ఆవేదన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

ముఖ్యంగా సొంత జిల్లాకే చెందిన సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. ఆయన కేవలం హుజూర్‌నగర్, కోదాడలకే మంత్రా లేక యావత్ తెలంగాణ రాష్ట్రానికి మంత్రా అంటూ నిలదీయడం నల్గొండ కాంగ్రెస్‌లో వర్గపోరును పతాక స్థాయికి చేర్చింది. ప్రభుత్వం నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతోందన్న భావన ప్రజల్లోకి వెళ్లేలా రాజగోపాల్ రెడ్డి మాట్లాడటాన్ని సొంత పార్టీ నేతలే కొందరు తప్పుపడుతున్నారు.

అసలు అసహనం వెనుక 'మంత్రి పదవి' ఆశలేనా

రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వెనుక కేవలం నిధుల అంశం మాత్రమే లేదని, మంత్రి పదవి దక్కలేదన్న తీవ్ర అసంతృప్తి ప్రధాన కారణంగా ఉందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎన్నికల ముందు బీజేపీని వీడి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పుడు అధిష్టానం ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తనకు కేబినెట్ బెర్త్ దక్కకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నారని, రాజగోపాల్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ తన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సీనియారిటీని తెరపైకి తెస్తున్నారని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆశించిన మంత్రి పదవి రాకపోవడం, ఇటు నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కేటాయించకపోవడంతోనే రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనంతో విమర్శల దాడి పెంచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇరకాటంలో ప్రభుత్వం

రాజగోపాల్ రెడ్డి తన కామెంట్స్‌తో సొంత పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తోందా లేక టీడీపీ పాలన నడుస్తోందా అంటూ ప్రభుత్వాన్ని సవాల్ చేయడం, కీలకమైన పనులన్నీ పొరుగు రాష్ట్ర కాంట్రాక్టర్లకే అప్పగిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించడం, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే రూ. 5 లక్షలు ఏమాత్రం సరిపోవంటూ సొంత పథకంపైనే అసంతృప్తి వ్యక్తం చేయడం తీవ్ర దుమారం రేపాయి.

టీపీసీసీ మౌనం.. పార్టీలో భిన్న స్వరాలు

ప్రభుత్వంపై, మంత్రులపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నప్పటికీ పార్టీ నాయకత్వం చూసీచూడనట్లు వ్యవహరించడంపై హస్తం పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గతంలో ఇతర నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగమేఘాల మీద స్పందించి చర్యలు తీసుకున్న అధిష్టానం, రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు ఉదాసీనంగా ఉంటోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గానీ, క్రమశిక్షణా కమిటీ గానీ ఈ వ్యవహారంపై మౌనం వహించడం వెనుక వ్యూహం ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

సొంత పార్టీ నుంచే ఎదురవుతున్న ఈ తిరుగుబాటు స్వరాలు రేవంత్ రెడ్డి సర్కార్‌కు రాజకీయంగా కొత్త సవాళ్లను విసురుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే లేవనెత్తిన ఈ రగడపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, ఈ అసంతృప్తి జ్వాలలను చల్లార్చడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

#Telangana Congress#Komatireddy Rajagopal Reddy#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి