కాంగ్రెస్ అధిష్టానం మౌనమెందుకు?
అంతా యాదృచ్ఛికమా? లేక అధిష్టానం వ్యూహమా?
సొంత పార్టీ లైట్.. ప్రత్యర్థుల స్పెషల్ విషెస్!
రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, చంద్రబాబు ప్రత్యేక గ్రీటింగ్స్
గతేడాది సీన్ రిపీట్ అయిందా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరు రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. సాధారణంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల పుట్టినరోజుల సందర్భంలో సోషల్ మీడియా వేదికగా లేదా ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలిపే కాంగ్రెస్ అగ్రనాయకత్వం.. రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం పూర్తిగా మౌనం దాల్చడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా 'ఇండియా' (INDIA) కూటమిలోని ఏ ఒక్క కీలక నాయకుడు కూడా రేవంత్ రెడ్డికి అధికారిక ప్రకటన లేదా ఎక్స్ (ట్విట్టర్) పోస్టులతోగానీ ఏరకంగానూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన దాఖలాలు కనిపించలేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో దీనిపై వివిధ కోణాల్లో అంతర్గత విశ్లేషణలు, చర్చలకు దారితీస్తున్నాయి.
మరోవైపు విపక్ష ఎన్డీఏ (NDA) కూటమికి చెందిన ప్రముఖ అగ్రనేతల నుంచి సీఎం రేవంత్ రెడ్డికి వెల్లువెత్తిన శుభాకాంక్షలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర నాయకులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు రేవంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు అందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ క్రమంలో సొంత పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి బర్త్ డేను లైట్ తీసుకోవడం, అదే సమయంలో ప్రత్యర్థి కూటమి నేతలై నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు వంటి వారు ప్రత్యేకంగా గ్రీటింగ్స్ పంపడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అధిష్టానంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉండగా గత సంవత్సరం (2025) నవంబర్ 8న రేవంత్‌రెడ్డి బర్త్ డే సందర్భంగానూ ఇలాంటి చర్చ జరిగింది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే బహిరంగంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలపలేదని వార్త కథనాలు రాగా, అదే రోజు మరో మీడియా సంస్థ సోనియా, రాహుల్ ఫోన్ చేసి విషెస్ తెలిపారని పేర్కొంది. గతేడాదిలాగే ఇప్పుడు కూడా అధిష్టానం రేవంత్‌కు ఫోన్‌లో విషెస్ తెలిపిందా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. మరి.. ప్రధాని మోదీ, చంద్రబాబు వంటి నేతలు విషెస్ చెబుతున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేతల నుంచి బహిరంగ స్పందన లేకపోవడం యాదృచ్ఛికమా? లేక పార్టీ అంతర్గత రాజకీయాలకు సంకేతమా? అనేది చర్చనీయాంశం.


