జననమరణ ధ్రువీకరణ పత్రాల జారీలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జనన, మరణాల నమోదు చట్టం -1969లో తీసుకొచ్చిన 'ది రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (అమెండ్‌మెంట్) యాక్ట్–2026' కొత్త నిబంధనలు చేయగా.. అక్టోబర్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం ఆలస్యంగా ధ్రువపత్రాలు పొందే విధానాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ మరింత కఠినతరం చేసింది. దీని ప్రకారం నిర్ణీత సమయంలోగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందలేని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నిబంధలు ఇలా..
జననం లేదా మరణం సంభవించిన 21 రోజుల్లోపు స్థానిక సంస్థలు (గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) ద్వారా ఉచితంగా ఎలాంటి రుసుము లేకుండా ధ్రువీకరణ పత్రం కోసం నమోదు చేసుకోవచ్చు.21 రోజుల నుండి 30 రోజులలోపు అయితే.. నిర్ణీత ఆలస్య రుసుము చెల్లించి నమోదు చేసుకోవచ్చు.
ఇక 30 రోజుల నుండి ఒక సంవత్సరంలోపు అయితే నిర్ణీత ఆలస్య రుసుముతో పాటు సంబంధిత అధికారుల అనుమతితో నమోదు చేయబడుతుంది. ఒక ఏడాది నుండి 2 సంవత్సరాల లోపు అయితే సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ లేదా వారు అధికారం కల్పించిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ప్రత్యేక అనుమతి తప్పనిసరి పొందాల్సి ఉంటుంది.
రెండు సంవత్సరాలు దాటితే తర్వాత జనన లేదా మరణం నమోదు చేయాలంటే స్థానిక అధికారులు నేరుగా ధ్రువపత్రాలు జారీ చేయరు. కచ్చితంగా ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (JMFC) కోర్టు ఉత్తర్వులు పొందాలి. కోర్టులో అఫిడవిట్ సమర్పించి, విచారణ అనంతరం మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సర్టిఫికేట్ ఇస్తారు. ఒక సంవత్సరం దాటిన తర్వాత దరఖాస్తు చేసుకునే ప్రతి విషయంలోనూ సమర్పించిన ఆధారాలు, వివరాల నిజానిజాలను అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారించిన తర్వాతే ధ్రువపత్రం మంజూరు చేస్తారు.
ఆధార్ నమోదు, విద్యా ప్రవేశాలు, ఆస్తుల బదలాయింపు, వారసత్వ హక్కులు, బీమా క్లెయిమ్‌లు, ప్రభుత్వ పథకాలకు ఈ ధ్రువపత్రాలు కీలకం. అందుకే జననం లేదా మరణం సంభవించిన వెంటనే స్థానిక సంస్థల్లో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో ఎవరైనా జనన లేదా మరణ ధ్రువపత్రాలు పొందలేని ఇప్పటికైనా వెంటనే స్థానిక సంస్థల్లో సంప్రదించి నమోదు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.లేదంటే పైన చెప్పిన విధంగా రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుందని, లేదంటే భవిష్యత్‌లో ఆస్తుల బదలాయింపు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పథకాలు పొందే అవకాశాన్ని కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


