యువతకు ఏమైంది? చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారు.. ఎవరూ ఊహించని విధంగా క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.అప్పటివరకు కళ్లముందు సరదాగా ఆడుతూ పాడుతూ కనిపించిన వ్యక్తులు అకస్మాత్తుగా కుప్పకూలుతున్నారు. అంతకుముందు నిర్వహించిన టెస్టుల్లోనూ వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవడం గమనార్హం. చిన్నారుల నుంచి 30 ఏళ్లలోపు వారు ఇటీవలి కాలంలో ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
అందుకు ఆధునిక జీవనశైలి కారణమా? మనం తీసుకుంటున్న ఆహరమే కారణమా? అంటే రెండూ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గడచిన వినాయక చవితి పండుగ సమయంలో డీజే పాటలకు డ్యాన్సులు వేస్తూ తెలుగు రాష్ట్రాల్లో పది మంది వరకు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.ఇక స్కూళ్లల్లోనూ ఇటీవలి కాలంలో చిన్నారులు ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. అదేంటని పరిశీలించగా హార్ట్ స్ట్రోక్స్ అని వైద్యులు వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తాజాగా ఏపీలో రాష్ట్రంలో మరో విషాదం నెలకొంది. నెల్లూరులో గుండెపోటుతో యువ డాక్టర్ లావణ్య మృతి చెందారు.చిన్న వయసులోనే డాక్టర్ లావణ్య గుండెపోటుతో కన్నుమూయడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. వైద్యం అందేలోపే తుదిశ్వాస విడిచిన సమాచారం. మృతురాలు ప్రాణాంతక ఆటో ఇమ్యూన్ నరాల వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.లావణ్య న్యూరాలజీలో గోల్డ్ మెడల్ సాధించినట్టు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వైద్య సలహాలు అందిస్తున్నట్టు సమాచారం.
అయితే, ఆమె తండ్రి, భర్త ఇద్దరూ వైద్యులే అని తెలిసింది. ఇంట్లో వైద్యులు ఉన్నా ఆమె ప్రాణాలు దక్కకపోవడంతో వారి కుటుంబంలోని వారు మరింత కుంగుబాటుకు గురవుతున్నారు.. చిన్న వయసులో డాక్టర్ కోర్సు పూర్తి చేసిన లావణ్యకు మంచి ఫ్యూచర్ ఉంటుందని ఫ్యామిలీ మెంబర్స్ భావించారు.కానీ, ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. యువ డాక్టర్ గుండెపోటుతో మరణించడంతో సామాన్యుల పరిస్థితి ఏంటని సోషల్ మీడియా వేదికగా పలువురు చర్చిస్తున్నారు.


