జాతీయం

డీలిమిటేషన్ బిల్లుపై ముందుకేనా..? 88 రోజులు గడిచినా ప్రొరోగ్ కాని పార్లమెంట్!

11 నిమిషాల పఠనం

పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడో ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కానీ అధికారికంగా మాత్రం సమావేశాలకు ముగింపు పలకలేదు. చివరకు 88 రోజులు పూర్తయ్యాయి. 2008లో ఉన్న 87 రోజుల రికార్డు కూడా బ్రేక్ అయింది. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది..? ఇదంతా డీ లిమిటేషన్ కోసమేనా..?

డీలిమిటేషన్ పై మరోసారి అడుగులు

పార్లమెంట్ ప్రొరోగ్ కాకపోవడానికి కారణాలేంటి..?

మహిళా రిజర్వేషన్ల అమలుకు మరో ప్రయత్నమా?

కేంద్రం వ్యూహం వెనుక అసలు లెక్కలేంటి?

పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడో ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కానీ అధికారికంగా మాత్రం సమావేశాలకు ముగింపు పలకలేదు. రోజులు గడుస్తున్నాయి. వారాలు దాటుతున్నాయి. చివరకు 88 రోజులు పూర్తయ్యాయి. 2008లో ఉన్న 87 రోజుల రికార్డు కూడా బద్దలైంది. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది..?

ఇదంతా యాదృచ్ఛికమేనా? లేక కేంద్ర ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయానికి రంగం సిద్ధం చేస్తోందా? ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల విషయంలో మళ్లీ పార్లమెంట్‌ను వేదికగా చేసుకోబోతోందా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నవంబర్ 9 నాటికి కూడా అధికారికంగా ప్రొరోగ్ కాలేదు. అంటే సమావేశాలు ఇంకా ముగియలేదన్నమాట. ఈ అసాధారణ పరిణామం వెనుక కేంద్రం వ్యూహం ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.

2008 రికార్డ్ బ్రేక్.. ఎందుకీ అసాధారణ పరిణామం?

సాధారణంగా పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రపతి సమావేశాలను ప్రొరోగ్ చేస్తారు. అంటే ఆ సెషన్‌కు అధికారికంగా ముగింపు పలుకుతారు. కానీ ఈసారి మాత్రం ఆ ప్రక్రియ జరగలేదు. దీంతో ఆగస్టు 13 నుంచి నవంబర్ 9 వరకు 88 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు ప్రొరోగ్ కాకుండా కొనసాగాయి. గతంలో 2008లో 87 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయింది.

ప్రొరోగ్ చేయకుండా ఉంచడం వల్ల అదే సెషన్‌ను తిరిగి సమావేశపరిచే అవకాశం ఉంటుంది. కొత్త సెషన్‌ను ప్రారంభించాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే కొనసాగుతున్న సెషన్‌ను తిరిగి నిర్వహించేందుకు కనీసం రెండు రోజుల నోటీసు సరిపోతుంది. కొత్త సెషన్‌కు మాత్రం ఎక్కువ సమయం అవసరం. అంటే కేంద్ర ప్రభుత్వం తన ముందున్న ఒక కీలకమైన అవకాశాన్ని ఇంకా క్లోజ్ చేయలేదన్నమాట.

అసలు టార్గెట్ డీలిమిటేషన్ బిల్లేనా?

ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు డీలిమిటేషన్ బిల్లు. మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం 2023లోనే ఆమోదం పొందింది. అయితే దాని అమలు జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపడి ఉంది.

2029 ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలన్నది కేంద్రం ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణతో పాటు డీలిమిటేషన్‌కు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ ఏడాది ఏప్రిల్ 16న కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో సభ్యుల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి గరిష్ఠంగా 850 వరకు పెంచే ప్రతిపాదన కూడా ఇందులో ఉంది. అయితే ఏప్రిల్ 17న జరిగిన ఓటింగ్‌లో రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మద్దతు లభించలేదు. దీంతో బిల్లు వీగిపోయింది. డీలిమిటేషన్ బిల్లు కూడా ముందుకు సాగలేదు.

అక్కడే కేంద్రానికి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు మళ్లీ అదే అంశాన్ని పార్లమెంట్ ముందుకు తీసుకురావాలంటే అవసరమైన సంఖ్యాబలం సమీకరించాల్సి ఉంటుంది.

దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు.. కేంద్రానికి సవాల్!

డీలిమిటేషన్ అనగానే రాజకీయంగా ముందుకొచ్చే ప్రధాన సమస్య రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యం. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభలో సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం ప్రస్తుత ప్రాతినిధ్యంలో వాటా తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన కనిపిస్తోంది.

ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఈ అంశంపై రాజకీయ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల వాదన ఒక్కటే. జనాభా నియంత్రణలో విజయం సాధించినందుకు రాజకీయ ప్రాతినిధ్యంలో శిక్ష పడకూడదనేది ఆయా రాష్ట్రాల డిమాండ్. ఈ ఆందోళనలను తగ్గించేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లను ఒకే నిష్పత్తిలో పెంచే ప్రతిపాదనను కేంద్రం పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే సీట్ల సంఖ్య పెరిగినా రాష్ట్రాల మధ్య వాటా మారకుండా ఉంటుందన్న హామీ, బిల్లు ఆమోదానికి కీలకం కానుంది. అందుకే డీలిమిటేషన్ అనేది కేవలం నియోజకవర్గాల సరిహద్దుల మార్పు మాత్రమే కాదు. దేశ రాజకీయ సమీకరణాలను మార్చగల అంశం.

మళ్లీ బిల్లు తెస్తే ఆమోదం సాధ్యమేనా?

ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సాధారణ మెజారిటీ సరిపోదు. సభ మొత్తం సభ్యత్వంలో మెజారిటీతో పాటు, ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు అవసరం. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ ఈ ప్రత్యేక మెజారిటీ సాధించాలి.

అంటే అధికార పక్షానికి మిత్రపక్షాల మద్దతు మాత్రమే సరిపోదు. అవసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించేందుకు ఇతర పార్టీలతోనూ చర్చలు జరపాల్సి ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు స్పష్టమైన పరిష్కారం చూపకుండా ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లడం అంత ఈజీ కాదు. మరోవైపు మహిళా రిజర్వేషన్ల అమలుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పుకునే రాజకీయ అవసరం కూడా కేంద్రానికి ఉంది.

ఇక్కడే కేంద్రం ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి.. రాష్ట్రాల మధ్య సీట్ల పంపిణీపై స్పష్టమైన హామీలతో బిల్లును మళ్లీ తీసుకురావడం. రెండోది.. అవసరమైన రాజకీయ మద్దతు లభించే వరకు చర్చలు కొనసాగించడం.

ప్రొరోగ్ చేయకపోవడం వెనుక వ్యూహం ఇదేనా?

రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ సమావేశాలను రాష్ట్రపతి ప్రొరోగ్ చేస్తారు. అయితే దానికి సంబంధించి నిర్దిష్ట గడువులోనే నిర్ణయం తీసుకోవాలనే నిబంధన లేదు. అందువల్ల 88 రోజుల పాటు ప్రొరోగ్ కాకుండా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని చెప్పలేం. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ పరిణామాన్ని సాధారణ ప్రక్రియగా కొట్టిపారేయలేం.

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, లోక్‌సభ సీట్ల పెంపు.. ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడిన కీలక అంశాలు. వీటిపై మరోసారి పార్లమెంట్‌లో చర్చ జరిగే అవకాశం ఉందన్న అంచనాలకు ప్రొరోగేషన్ ఆలస్యం బలం చేకూరుస్తోంది. మరి కేంద్రం నిజంగానే డీలిమిటేషన్ బిల్లును మళ్లీ తెరపైకి తీసుకురాబోతోందా? దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పక్కనపెట్టి ముందుకెళ్తుందా? లేక రాజకీయ ఏకాభిప్రాయం కోసం కొత్త ఫార్ములాను సిద్ధం చేస్తుందా? ఈ అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

88 రోజులుగా తెరిచే ఉన్న పార్లమెంట్ సమావేశాల వెనుక అసలు రాజకీయ ఎత్తుగడ ఏంటన్నది తేలాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఇది మరో ముందడుగు అవుతుందా? లేక డీలిమిటేషన్ చుట్టూ మరోసారి రాజకీయ పోరు మొదలవుతుందా? ఇప్పటికే ఎన్డీయే వర్సెస్ ఇండి కూటమి అన్నట్టుగా దేశ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. సర్ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఈ క్రమంలో కేంద్రం.. డీలిమిటేషన్ బిల్లును మరోసారి తెరపైకి తెచ్చే సాహసం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

#Parliament Delimitation#Delimitation Bill 2026#Parliament News#Parliament Monsoon Session#Parliament Prorogation#Narendra Modi#Amit Shah#Rahul Gandhi#Mallikarjun Kharge#Women's Reservation Bill#33 Percent Reservation#Lok Sabha Expansion#850 Lok Sabha Seats#Indian Politics#South India Politics#Constitution Amendment Bill#Delimitation Controversy#India Political News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి