అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో నెలకొన్న సైనిక ఉద్రిక్తతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై కొత్తగా దాడులు చేయాల్సిన అవసరం వచ్చే అవకాశాలు చాలా తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియా ప్రాంతంలో అణు కార్యక్రమం నియంత్రణ, కీలకమైన హర్మూజ్ జలసంధి పునఃప్రారంభం వంటి అంశాలపై జరిపే దౌత్యపరమైన చర్చలు సానుకూలంగా సాగితే అమెరికా వైపు నుంచి మళ్లీ సైనిక చర్యలు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. అయితే, ఒకవేళ తమతో బలమైన ఒప్పందానికి ఇరాన్ ససేమిరా అంగీకరించకపోతే మాత్రం మరోసారి సైనిక దాడులకు వెనుకాడేది లేదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
ప్రముఖ వార్తా సంస్థ నిర్వహించిన ప్రత్యేక ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఈ కీలక వివరాలను పంచుకున్నారు. అమెరికా విధించిన ఆంక్షలు, చేపట్టిన కఠిన చర్యల వల్ల ఇరాన్లో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, అక్కడ ద్రవ్యోల్బణం ఏకంగా 301 శాతానికి చేరుకుందని వ్యాఖ్యానించారు. చర్చలు కొలిక్కి వస్తే యుద్ధం అవసరం ఉండదని పునరుద్ఘాటించారు. అయినప్పటికీ, ఏ నిమిషంలోనైనా దాడి చేసేందుకు పశ్చిమాసియా సముద్ర తీరంలో తమ మూడు విమాన వాహక నౌకలు (Aircraft Carriers) సర్వసన్నద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలు, 38 ప్రధాన వంతెనలను తమ సైన్యం లక్ష్యాలుగా ఎంచుకుందని, కేవలం గంట వ్యవధిలోనే వాటిని ధ్వంసం చేయగల సామర్థ్యం తమకు ఉందంటూ ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఆ దేశ నిర్మాణాలను నాశనం చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని, వాటిని తిరిగి నిర్మించుకోవడానికి కనీసం పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు, అమెరికా సైనిక చర్యల కారణంగా ఇరాన్ వద్ద ప్రస్తుతం కేవలం 10శాతం క్షిపణులు, 15శాతం డ్రోన్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, వారి వైమానిక రక్షణ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, పాకిస్థాన్ దేశాలు ముమ్మర దౌత్య ప్రయత్నాలు ప్రారంభించాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్ కఠిన డిమాండ్లపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఇరాన్ కూడా నూతన ఒప్పందానికి ఆసక్తిగా ఉందనే భావనను ట్రంప్ వ్యక్తం చేయడం గమనార్హం.


