భారత చదరంగం చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 22ఏళ్ల కుర్రాడు అనుజ్ శ్రీవత్రి భారత 100వ చెస్ గ్రాండ్‌మాస్టర్(GM)గా అవతరించి రికార్డు సృష్టించాడు. ఫిలిప్పీన్స్‌లో వైభవంగా ముగిసిన '7వ ఏషియన్ ప్లస్ ఇండివిడ్యువల్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్'లో విజేతగా నిలవడం ద్వారా ఆయన ఈ చారిత్రక ఘనతను చేజిక్కించుకున్నాడు. ఈ అద్భుత విజయంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన తొలి క్రీడాకారుడిగా కూడా అనుజ్ రికార్డులో నిలిచాడు.
ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ విజేతకు నేరుగా గ్రాండ్‌మాస్టర్ టైటిల్ ప్రదానం చేసేందుకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) ప్రత్యేక నిబంధనల కింద ముందే అనుమతిని ఇచ్చింది. పర్యవసానంగా సాధారణంగా అవసరమయ్యే మూడు జీఎం నార్మ్‌లు, 2500 ఎలో (Elo) రేటింగ్ సాధించాల్సిన నిబంధనలతో ప్రమేయం లేకుండానే అనుజ్ శ్రీవత్రి నేరుగా గ్రాండ్‌మాస్టర్ హోదాను సొంతం చేసుకున్నాడు. టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన అనుజ్ తొలి గేమ్‌లో పరాజయం పాలైనప్పటికీ, అసాధారణమైన సమయస్ఫూర్తితో పుంజుకుని మొత్తం 9 గేమ్‌లలో 7 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాడు.
భారత చెస్ రంగానికి ఈ 100వ గ్రాండ్‌మాస్టర్ మైలురాయి ఎంతో విలువైనది. 1988లో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ భారతదేశపు తొలి గ్రాండ్‌మాస్టర్‌గా నిలవగా, 100వ గ్రాండ్‌మాస్టర్ స్థాయికి చేరుకోవడానికి సుమారు 38ఏళ్ల సమయం పట్టింది. ముఖ్యంగా 2010 సంవత్సరం తర్వాత దేశంలో గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య అత్యంత వేగంగా పెరిగింది. మధ్యప్రదేశ్‌లోని కట్నీ ప్రాంతానికి చెందిన అనుజ్ శ్రీవత్రి 2019నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్ (IM)గా కొనసాగుతున్నాడు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన అనుజ్, చెస్ క్రీడపై ఉన్న తీవ్రమైన ఆసక్తితో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సైతం త్యజించి సాధన కొనసాగించడం విశేషం.
అనుజ్ శ్రీవత్రి సాధించిన చారిత్రక విజయం పట్ల అఖిల భారత చెస్ సమాఖ్య (AICF) అధ్యక్షుడు నితిన్ నారంగ్, భారత చెస్ పితామహుడు విశ్వనాథన్ ఆనంద్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దీపావళి పర్వదినం వేళ భారత చెస్ 100వ గ్రాండ్‌మాస్టర్ మైలురాయిని చేరడంపై ఆనంద్ స్పందిస్తూ.. ‘ఇది పండుగ వేళ ఇది క్రాకర్ లాంటి 100’ అని వ్యాఖ్యానించాడు.


