యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో ఖరీదైన బహుమతిని సొంతం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) టోర్నమెంట్‌లో అసాధారణ బ్యాటింగ్ ప్రతిభ కనబరిచి 'సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డును కైవలం చేసుకున్నాడు. ఈ మేరకు వైభవ్‌కు టాటా సంస్థ ఖరీదైన 'టాటా సియెర్రా ఎస్‌యూవీ' (Tata Sierra SUV) కారును అందించింది. వైభవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి షోరూమ్‌కు వెళ్లి పసుపు రంగు సియెర్రా కారు ముందు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించాడు. మొత్తం 16మ్యాచ్‌లలో పాల్గొని ఏకంగా 776పరుగులు సాధించి ప్రతిష్టాత్మక 'ఆరెంజ్ క్యాప్'ను కైవసం చేసుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు సాధించాడు. ముఖ్యంగా మైదానం నాలుగు దిశలా చెలరేగుతూ ఏకంగా 63 ఫోర్లు, 72 భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ విధ్వంసకర బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కారణంగానే అతనికి 'సూపర్ స్ట్రైకర్' పురస్కారం దక్కింది.
ఈ యువ క్రికెటర్‌కు కార్లు బహుమతిగా రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ సూపర్ స్ట్రైకర్ అవార్డు గెలుచుకున్నప్పుడు టాటా 'కర్వ్ ఈవీ' (Curvv EV) కారును గెలుచుకున్నాడు. ఇప్పుడు తాజాగా మరో ఎస్‌యూవీ కారు అతడి కార్ల కలెక్షన్‌లో చేరింది. దీంతో అభిమానులు, క్రీడా ప్రముఖులు అతనికి సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు.
2025లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన వైభవ్, తన అద్భుతమైన ఫామ్‌తో టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 10 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 295 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం సీనియర్ బిహార్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఎంపికై తన నాయకత్వ ప్రతిభను చాటుకుంటున్నాడు.


