రాజకీయాల్లో అధికార,ప్రతిపక్ష పార్టీలు ఒక్కటవ్వడం సాధ్యం కాదు. ఇరు పార్టీలకు చెందిన నేతలు భేటీ అవ్వడం కూడా అరుదుగా జరుగుతుంటుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ఉంది. ఈ విషయం రాజకీయ నేతలకు చాలా బాగా తెలుసు. ఈ రోజు ఒక పార్టీలో ఉన్న నేత రేపటి రోజున ఏపార్టీలో ఉంటారనేది ఎవరూ ఊహించలేరు. అధికార మార్పిడి జరిగిన సమయాల్లో నేతలు పార్టీలు మారడం కామన్. అయితే, పార్టీలు మారకుండానే బీజేపీకి చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్, అధికార కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.
పొద్దున లేస్తే ఇరు పార్టీలకు చెందిన నేతలు విమర్శలు చేసుకోవడం కామన్. మంత్రి పొన్నం కేంద్రంలోని బీజేపీని విమర్శిస్తే.. కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నకాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ, ఇవాళ వీరిద్దరూ నేతలు ఒకేసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత కరీంనగర్ అభివృద్ధే లక్ష్యం అని తేల్చిచెప్పారు. ఎన్నికల తర్వాత వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.
70 నుంచి 90 శాతం పూర్తయి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. భీమదేవరపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు, జమ్మికుంట, హుస్నాబాద్‌లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఫార్మసీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. విద్య, వైద్యం, పారిశ్రామిక పార్కులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తామని స్పష్టంచేశారు.
వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, కొత్తకొండ ఆలయాలతో పాటు ఎలగందుల ఖిల్లా, పర్యాటక ప్రాంతాలు, జలవనరులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ నగర అర్బన్ డెవలప్‌మెంట్‌పైనా ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు.అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చి ఉత్తర తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లాగా ఉమ్మడి కరీంనగర్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం స్పష్టంచేశారు.


