TG: మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. మూసీ పునరుజ్జీవనం ముసుగులో ఏకంగా రూ.1,108.27 కోట్ల ప్రజాధనాన్ని ఓ దేవాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి మళ్లించారంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్ర ఖజానా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, ప్రజాధనాన్ని ఇలా దారి మళ్లించడం దారుణమంటూ నిలదీసింది. ఈ నిధుల కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డుకు లేఖ రాయడంతో సచివాలయ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.
జీవో 928 వెనుక అసలు కథేంటి
మూసీ ప్రాజెక్టు పరిధిలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం అక్టోబర్ 7న జీవో ఆర్‌టీ నెం. 928ను రిలీజ్ చేసింది. దీని కింద ఏకంగా రూ.1,108.27 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. అయితే, ఎంఆర్‌డీసీఎల్ నిధులను ఇలా ఆధ్యాత్మిక ప్రాజెక్టుల వైపు మళ్లించడంపై గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల పన్నుల సొమ్ముతో నడిచే కార్పొరేషన్ నిధులను ప్రాధాన్యత లేని పనులకు కేటాయించడం క్షమించరాని నేరమని తాజా లేఖలో ఎండగట్టారు.
ఆధ్యాత్మికత పేరిట వేల కోట్ల ఖర్చులా
ఇప్పటికే మతపరమైన అంశాలకు వేల కోట్ల రూపాయలు వెచ్చించిన తీరును ఫోరం గణాంకాలతో సహా నిలదీసింది. రానున్న గోదావరి పుష్కరాల కోసమే ప్రభుత్వం ఇప్పటికే రూ.1,000 కోట్లు కేటాయించగా, అందులో కొంత మొత్తం విడుదలైంది. గోదావరి తీర దేవాలయాలతో పాటు భద్రాచలానికి రూ.276 కోట్లు, బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి రూ.354 కోట్లు చొప్పున మొత్తం రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తామని ఉప ముఖ్యమంత్రే అధికారికంగా ప్రకటించారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసమే ప్రభుత్వం సుమారు రూ.800 కోట్లు ఖర్చు చేసింది. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు మూసీ కార్పొరేషన్ నిధుల నుంచి ఏకంగా మరో రూ.1,108.27 కోట్లను ఓంకారేశ్వరాలయానికి కేటాయించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
విద్య, వైద్యం వదిలేసి.. ఇదేం ప్రజాపాలన?
ఒక లౌకిక వ్యవస్థలో ప్రజారోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు నిధుల లేమితో అల్లాడుతుంటే.. వేల కోట్ల రూపాయలను ఆధ్యాత్మిక ప్రాజెక్టులకు ధారపోయడం వెనుక ఆంతర్యమేంటని గుడ్ గవర్నెన్స్ ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు పూర్తిగా గతి తప్పాయని మండిపడింది. ఈ వ్యవహారంపై ఎంఆర్‌డీసీఎల్ డైరెక్టర్ల బోర్డు తక్షణమే పునఃసమీక్ష జరిపి, ఓంకారేశ్వర ఆలయ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పురపాలక, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌బోర్డ్, పోలీస్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు కూడా లేఖలు పంపడంతో సర్కార్ తీసుకున్న ఈ జీవో నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసేలా కనిపిస్తోంది.


