ACB: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ అవినీతికి కేరాఫ్ గా మారింది. కీసర పోలీస్ స్టేషన్ లో మరో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. మొన్న సీఐ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అది మరువక ముందే ఇప్పుడు ఎస్ఐ చేయి చాచి దొరికిపోయాడు. 2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఎస్ఐ శ్రీనివాస్.
5లక్షలు డిమాండ్.. 2లక్షలకు డీల్
చీటింగ్, వరకట్నం వేధింపుల కేసులో బాధితుల నుంచి ఎస్ఐ 5లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక, తొందరగా ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు కూడా లంచం అడిగినట్లు శ్రీనివాస్ పై ఆరోపణలు వచ్చాయి. అంత డబ్బు ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పడంతో.. 2లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు ఎస్ఐ శ్రీనివాస్. లంచం ఇవ్వాలని పదే పదే కాల్స్ చేసి డిమాండ్ చేశాడు. ఎస్ఐ వేధింపులు తాళలేకపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
వరుసగా అవినీతి ఘటనలతో పోలీస్ శాఖలో కలకలం
నాగారం పరిధిలోని శిల్పానగర్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో 2లక్షలు తీసుకుంటూ ఉండగా ఎస్ఐని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎస్ఐని అరెస్ట్ చేశామని, కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఇటీవల ఇదే పోలీస్ స్టేషన్ లో ఓ కేసులో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు సర్కిల్ ఇన్ స్పెక్టర్. తాజాగా ఎస్ఐ ఏసీబీకి చిక్కాడు. కీసర పోలీస్ స్టేషన్ లో వరుస అవినీతి ఘటనలు.. పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నాయి.
ఛార్జిషీట్ దాఖలుకు 5లక్షలు డిమాండ్
''ఫోర్జరీ కేసు పేరుతో సీఐ ఆంజనేయులు, ఎస్ఐ శ్రీనివాస్ నా దగ్గర 10లక్షల 50వేలు తీసుకున్నారు. డబ్బులు ఇచ్చినా నన్ను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారు. దీని గురించి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత వరకట్నం వేధింపుల కేసులో ఛార్జిషీట్ దాఖలు చేస్తే కోర్టుకెళ్లి న్యాయం జరిగేలా చూసుకుందామని ప్రయత్నిస్తున్నా. అయితే, ఛార్జిషీట్ దాఖలు చేయకుండా ఆలస్యం చేస్తూ ఎస్ఐ శ్రీనివాస్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. తొందరగా ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు 5లక్షలు లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పాను. బేరసారాలు చేసి చివరికి 2లక్షలకు ఒప్పుకున్నారు'' అని బాధితుడు వాపోయాడు.


