Gaddam Prasad Kumar: కొడంగల్ గడ్డపై 9వేల 500కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్. ఇది కదా అభివృద్ధి అంటే అని ఆయన అన్నారు. ఇది కొడంగల్ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అని అభివర్ణించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్లో ఎకో-పామ్ ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం రైతు బహిరంగ సభలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ వెంట స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉన్నారు.
నాడు వైఎస్.. నేడు రేవంత్..
రాష్ట్ర అభివృద్ధి కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలూ కష్టపడుతున్నారని కితాబిచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ప్రజల కోసం ఇలా కష్టపడే ముఖ్యమంత్రుల్లో నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూశాను.. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తున్నా అని అన్నారు. నాడు పేదల కోసం వైఎస్ఆర్ అనేక పథకాలు అమలు చేస్తే.. నేడు రేవంత్ రెడ్డి కూడా అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఎవరైనా సరే అభివృద్ధిని స్వాగతించాల్సిందే అన్నారు.
రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు
''సీఎం రేవంత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అనేక ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం.. ఈ రెండింటినీ జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తోంది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి చాలా దూరదృష్టితో పని చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి ఫలాలు రేపు మన బిడ్డల భవిష్యత్తు కోసమే. ఈ విషయాన్ని అందరూ ఆలోచించాలి. మన రాష్ట్రానికి అతి త్వరలోనే మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయి. డిసెంబర్ లో తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
తెలంగాణలో ఒలింపిక్స్..!
అంతేకాదు.. క్రీడలకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది. మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్నారు. రానున్న ఒలింపిక్స్ ను మన తెలంగాణలో జరిపేలా ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటిన మన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. ఇది కదా ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న గొప్ప నిర్ణయాలు. యువతను విదేశాలకు పంపించడానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. మంత్రి వివేక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు జపాన్ తో పాటు ఇతర విదేశీ భాషలను నేర్పిస్తోంది'' అని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు.
రైతులు అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి
''ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం కనిపిస్తోంది. రైతులందరూ వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. ఎల్ నినోను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో మనం కూడా భాగస్వాములం కావాలి. ప్రకృతి విపత్తును మనం ఆపలేము. కానీ, దానిని ఎదుర్కొనే శక్తి, సంకల్పం మన దగ్గర ఉంది'' అని స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పం
''ప్రజా ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలను మన ఆడబిడ్డల పేర్ల మీదనే అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు. అన్నీ మహిళల పేరు మీదనే ఉన్నాయి. ఇది ప్రజా ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న గొప్ప గౌరవం. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే గొప్ప సంకల్పం నిజంగా అభినందనీయం. దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. ఇప్పటికే రైతు సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం. మనమంతా కలిస్తేనే తెలంగాణ ముందుకు వెళ్తుంది'' అని పిలుపునిచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్.


