Road Accident: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎర్టిగా కారు వేముల స్టేజి వద్దకు రాగానే అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న ఇనుప రైలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. నేపాల్ నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారు స్వల్ప గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుండి క్షేమంగా బయటపడ్డారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


