గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో డబుల్ బిల్లింగ్ పేరుతో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందనే వార్తలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులతో పాటు.. డూప్లికేట్ బిల్లుల్లో అదనపు మొత్తాలు చెల్లించినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందులో భాగంగా 102 మంది కాంట్రాక్టర్లకు సుమారుగా రూ.70 కోట్ల డబుల్ బిల్లులు చెల్లించినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి..
ఈ అవినీతి విషయం బయటికి పొక్కడంతో అధికారులు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసే పనిలో పడ్డారని సమాచారం. ఈ క్రమంలో 12 మంది కాంట్రాక్టర్ల నుంచి సుమారు రూ.7 కోట్లు వసూలు చేసినట్టు.. ఘటనకు బాధ్యుడిగా భావిస్తూ, జీహెచ్‌ఎంసీ ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ చంద్రను విధుల నుంచి తప్పించడమే కాకుండా ఈ వివాదంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్.. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలుస్తుంది.
మరోవైపు ఈ వ్యవహారంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్పందించి, అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మొత్తం 78 ఈఆర్‌పీ ఇన్‌వాయిస్‌లలో రూ.6 కోట్ల 92 లక్షల 11 వేల 434 రూపాయల మేర డూప్లికేట్, ఎక్సెస్ చెల్లింపుల వ్యత్యాసాలు గుర్తించారు. ఈ వ్యవహారం బయటపడిన వెంటనే అధికారులు రికవరీ చర్యలు చేపట్టారు. ఇప్పటికే 74 ఇన్‌వాయిస్‌లకు సంబంధించి రూ.6 కోట్ల 83 లక్షల 75 వేల 773 రూపాయలు రికవరీ చేసినట్లు కమిషనర్ తెలిపారు.
మరో రూ.8 లక్షల 35 వేల 661 రూపాయలు నాలుగు ఇన్‌వాయిస్‌లకు సంబంధించి డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో అందినట్లు చెప్పారు. ఆ మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ జనరల్ ఫండ్‌లో జమ చేయాల్సి ఉందని వెల్లడించారు. కాంట్రాక్టర్ల బకాయిలను చెల్లించేందుకు జీహెచ్‌ఎంసీ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్, అంటే ట్రీడీఎస్ అనే డిజిటల్ వేదికను ఉపయోగిస్తోంది. ఫ్లైఓవర్లు, రోడ్ల మరమ్మతులు, వ్యర్థాల నిర్వహణ వంటి పలు పనులకు సంబంధించిన బకాయిల చెల్లింపుల్లో ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు..
ఈ సిస్టమ్ లో అత్యవసర అవసరాల కోసం కొంతమంది కాంట్రాక్టర్లు ముందుగానే నిధులు తీసుకునే అవకాశం ఉంది. ఆవిధంగా తీసుకున్న మొత్తాలను తర్వాత వారికి చెల్లించాల్సిన తుది బిల్లుల నుంచి మినహాయించాల్సి ఉంటుంది. అయితే పాత జీహెచ్‌ఎంసీ విభజన అనంతరం ట్రీడీఎస్ నిర్వహణ సంస్థ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసిన సమయంలో.. కాంట్రాక్టర్లు ముందుగా తీసుకున్న మొత్తాలను తుది చెల్లింపులతో సక్రమంగా సర్దుబాటు చేయడంలో లోపాలు తలెత్తినట్లు అధికారులు గుర్తించారు.. కాంట్రాక్టర్ల పనులు, బిల్లులు, చెల్లింపులను ఈఆర్‌పీ వ్యవస్థలో మ్యాపింగ్ చేస్తున్న సమయంలో ఈ వ్యత్యాసాలు బయటపడ్డాయి.
ఈ అక్రమ చెల్లింపులను గుర్తించినట్లు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ సమయంలో ఆన్‌లైన్ చెల్లింపుల ధ్రువీకరణలు, ఖాతాల విభజన, అదనపు కమిషనర్ ఫైనాన్స్ నిర్వహించిన సమీక్ష ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ అంశంపై ఆగస్టు 28న ప్రాథమిక విజిలెన్స్ విచారణ నివేదిక సమర్పించగా.. జూలై 27న సమగ్ర విచారణ కోసం విజిలెన్స్ విభాగానికి అధికారికంగా అప్పగించినట్లు కమిషనర్ తెలిపారు.
అలాగే ఈ వ్యత్యాసాలు గుర్తించిన వెంటనే సంబంధిత కాంట్రాక్టర్లను జీహెచ్‌ఎంసీ-ఈఆర్‌పీ వ్యవస్థలో బ్లాక్ చేసి, డబ్బు రికవరీ ప్రక్రియను ప్రారంభించినట్టు పేర్కొన్నారు.. ఇక ట్రీడీఎస్ వేదికలను నిర్వహించే సంస్థలు.. తమ బ్లాక్‌చెయిన్ ఆధారిత డూప్లికేట్ బిల్లు గుర్తింపు వ్యవస్థలు విఫలమైనట్లు అంగీకరించాయని కమిషనర్ వెల్లడించారు. మరోవైపు ఈ వ్యవహారంలో రూ.100 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని, 200 మందికి పైగా కాంట్రాక్టర్లు ఉన్నారని వచ్చిన వార్తలు వాస్తవాలు కాదని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్పష్టం చేశారు. అధికారిక రికార్డుల ప్రకారం ప్రస్తుతం గుర్తించిన మొత్తం రూ.6.92 కోట్లేనని తెలిపారు.
ఈ అంశంపై శాఖాపరమైన విచారణతో పాటు ప్రత్యేక ఆడిట్ కూడా జరుగుతోంది. ఇందులో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. ఇక పూర్తి వివరాలు ప్రత్యేక ఆడిట్ విచారణ పూర్తయిన తర్వాతే బయటికి రానున్నట్టు తెలుస్తుంది..











