ఇండియా నుంచి ఫారిన్ వెళ్లిన కొందరు ఇంకా ఇక్కడి సంప్రదాయాలను పాటించడం మర్చిపోలేదని తెలుస్తోంది. అయితే, వారు పాటించే సంప్రదాయాలు కొందరికి అనుమానంతో పాటు భయాన్ని కూడా కలిగిస్తోందని సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రత్యక్షం అవ్వగా అది కాస్త వైరల్ అవుతోంది.అందులో ఓ జంట నడిరోడ్డుపై దీపం పెట్టారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
అయితే, వారు ఏదో తాంత్రిక పూజలు చేస్తున్నారని అక్కడి వారు అనుమానించడం గమనార్హం. వివరాల్లోకివెళితే.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ శివారు Knowsley Avenueలో.. ఆగస్టు 29న ఓ ఇండియన్ జంట ప్రధాన రహదారిపై దీపం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అవ్వగా.. ఆ ఫుటేజ్‌ను Wyndham TVకు గుర్జీత్ అనే స్థానికుడు అందించాడు.
ఈ ఘటన తనని భయబ్రాంతులకు గురి చేసిందని, ఇలాంటివి చేయడం బ్లాక్ మ్యాజిక్ కిందకే వస్తుందని గుర్జీత్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వాహనాలు వచ్చిపోయే దారిలో ఇలాంటివి చేయడం వలన కొందరు భయభ్రాంతులకు లోనయ్యే అవకాశం ఉంటుందని, ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటాయని ఆయన ఆరోపించారు. మరోసారి ఇలా జరగకుండా ఆ జంట మీద చర్యలు తీసుకోవాలని సదరు ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.
https://x.com/pulsenewsbreak/status/2094974340760842374?s=20
కాగా,ఇండియా నుంచి వెళ్లిన కపుల్స్, ఎన్నారైలు అక్కడి వాతావరణానికి తగ్గట్టు జీవించాలని, ఇలా నడిరోడ్డుపై దీపాలు పెట్టడాలు, సౌండ్ పెద్దగా పెట్టుకుని వేడుకలు జరుపుకోవడాలు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా వ్యవహరించాలని సోషల్ మీడియా వేదికగా పలువురు సూచిస్తున్నారు. ఇలా నడిరోడ్డుపై దీపం పెడితే బ్లాక్ మ్యాజిక్ అని పలువురు భావిస్తారని కామెంట్స్ చేస్తున్నారు. విదేశాల్లో ఇలాంటి పనులు చేసి భారత్ పరువు తీయొద్దని మరికొందరు హితవు పలికారు.












