రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లాల్లో ఆ పార్టీ నేతలు వేడుకలు చేస్తున్నారు. ఈ వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, సాధించిన ఘనతలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరపాలని జిల్లా డీసీసీ నేతలకు నిన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు పంపారు. అయితే, నిన్న రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా నగగరంలో పోస్టర్లు అంటించడం కలకలం రేపింది.
వెయ్యి రోజుల పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లో పోస్టర్లు అంటించడంతో నగరవాసులు జోరుగా చర్చించుకుంటున్నారు. ‘1000 డేస్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్’ అనే శీర్షికతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసినట్టు సమాచారం. నగరంలో అత్యంత రద్దీగా ఉండే అసెంబ్లీ, సచివాలయం, ట్యాంక్ బండ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ పరిసరాలు, మెట్రో పిల్లర్లు, జూబ్లీహిల్స్, బేగంపేట వంటి ప్రాంతాలతో పాటు అధికార పార్టీ కేంద్ర కార్యాలయమైన గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లోనూ ఈ పోస్టర్లు అంటించడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
‘TGSMS’ పేరుతో పోస్టర్లు వెలిశాయి.సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ‘ఏఐ’ చిత్రాలను వ్యంగ్యంగా ముద్రించారు. ఓ వైపు నోట్ల కట్టలతో ఉన్న భారీ మూటను సీఎం మోసుకెళ్తుండగా.. మరోవైపు ప్రజలు, యువత ఆవేదనతో చేతులెత్తి సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు, ఆర్తనాదాలు చేస్తున్నట్టు ఆ చిత్రాలు ప్రతిబింబిస్తున్నాయి. పోస్టర్ల రూపంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో గోడలు, మెట్రో పిల్లర్లపై ఈ పోస్టర్లను అంటింగా.. కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ప్రతిపక్షాల పనే అని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటిని ఎవరు అంటించారో వారిటి పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుననారు. కాగా, ఈ పోస్టర్లను వెంటనే తొలగించాలని జీహెచ్ఎంసీ సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడినట్టు సమాచారం. ప్రస్తుతం నగరంలో ఎక్కడెక్కడ ఈ పోస్టర్లు వెలిశాయో అక్కడ వాటిని మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నట్టు సమాచారం.










