National

సముద్రం ముంచుకొస్తోంది..! ముంబై, కోల్‌కతా మునిగిపోతాయా..?

రచన: Kashi7 నిమిషాల పఠనం

సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.. తీరప్రాంత‌ నగరాలపై ముప్పు వేగంగా పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదం కాదు.. ఇప్పటికే మొదలైన సంక్షోభం అని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ముఖ్యంగా భారత్‌లోని ముంబై, కోల్‌కతా నగరాలతో పాటు దక్షిణాసియాలోని లోతట్టు డెల్టా ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్లాది మందికి తీవ్ర ప్రమాదం పొంచి ఉందని UN తాజా నివేదిక వెల్లడించింది.

తీవ్ర ముప్పు ముంగిట ముంబై, కోల్‌క‌తా

కోట్లాది మందికి ప్ర‌మాదం త‌ప్ప‌దా..?

భ‌య‌పెడుతున్న ఐక్య‌రాజ్య స‌మితి రిపోర్ట్

సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.. తీరప్రాంత‌ నగరాలపై ముప్పు వేగంగా పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదం కాదు.. ఇప్పటికే మొదలైన సంక్షోభం అని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ముఖ్యంగా భారత్‌లోని ముంబై, కోల్‌కతా నగరాలతో పాటు దక్షిణాసియాలోని లోతట్టు డెల్టా ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్లాది మందికి తీవ్ర ప్రమాదం పొంచి ఉందని UN తాజా నివేదిక వెల్లడించింది.

ఐరాస సెక్రటరీ జనరల్ నివేదిక సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ప్రమాదాలను వివరించింది. దక్షిణాసియాలోని కోల్‌కతా, ముంబై, ఢాకా వంటి నగరాల్లో 1.4 కోట్ల మందికి పైగా ప్రజలు నీట మునిగి ఇళ్లను కోల్పోయే ముప్పులో ఉన్నారని నివేదిక పేర్కొంది.

ముంబై, కోల్‌కతాకు ఎందుకు ముప్పు?

తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు సముద్ర మట్టాల పెరుగుదలతో పాటు మరో ప్రమాదం కూడా ఎదురవుతోంది. అదే భూమి కుంగిపోవడం, సముద్ర మట్టం పెరగడం. రెండూ కలిసి వరదల తీవ్రతను పెంచుతున్నాయి.

ముంబై వంటి మహానగరాల్లో సముద్రం నుంచి వచ్చే నీరు నగరంలోని మౌలిక సదుపాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కోల్‌కతా వంటి లోతట్టు డెల్టా ప్రాంతాల్లో పరిస్థితి మరింత సున్నితంగా ఉంటుంది.

UN ప్రకారం ఇప్పటికే సముద్ర మట్టాల పెరుగుదల పట్టణ మౌలిక వసతులు, నీటి వ్యవస్థలు, రవాణా నెట్‌వర్క్‌లు, విద్యుత్ గ్రిడ్‌లు, భవనాలు, భూగర్భ జలాలపై ప్రభావం చూపుతోంది.

2024లో రికార్డు స్థాయిలో పెరుగుదల

సముద్ర మట్టాల పెరుగుదల వేగం కూడా ఆందోళన కలిగిస్తోంది. 2014-2023 మధ్య ప్రపంచ సముద్ర మట్టం సగటున సంవత్సరానికి 4.7 మిల్లీమీటర్లు పెరిగింది. అయితే 2024లో ఒక్క సంవత్సరంలోనే 5.9 మిల్లీమీటర్ల పెరుగుదల నమోదైంది. అసాధారణమైన సముద్ర ఉష్ణోగ్రతలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా UN పేర్కొంది.

గ్లేసియర్లు కరగడం, సముద్రాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు విస్తరించడం.. ఇవే సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణాలు. వీటి వెనుక మానవ కార్యకలాపాల వల్ల పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కీలక పాత్ర పోషిస్తోంది.

నీళ్లు ఉంటాయి.. కానీ తాగడానికి ప‌నికిరావు!

సముద్ర మట్టాల పెరుగుదల అంటే కేవలం వరదలు రావడం మాత్రమే కాదు. తాగునీటిపై కూడా భారీ ప్రభావం పడుతుంది.

సముద్రపు ఉప్పునీరు భూగర్భ జలాల్లోకి చొచ్చుకెళ్లడంతో మంచినీటి బావులు, భూగర్భ జలాలు ఉప్పగా మారే ప్రమాదం ఉంది. దీంతో తాగునీటి భద్రత, వ్యవసాయం, సాగునీటి వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అంతేకాదు.. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు పెరగడం, పారిశుద్ధ్య వ్యవస్థలు దెబ్బతినడం, ప్రజల ఆరోగ్యంపై ఒత్తిడి పెరగడం వంటి పరిణామాలు కూడా ఉంటాయని UN హెచ్చరించింది.

ప్రపంచవ్యాప్తంగా 77 కోట్ల మందికి ముప్పు

సముద్ర మట్టాల పెరుగుదల ప్రభావం కేవలం భారత్‌కే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 77 కోట్ల మంది ప్రజలు అధిక ముప్పు ఉన్న తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా పెరుగుతున్న వరదలు, తీరపు కోత, ఉప్పునీటి చొరబాటు వంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.

అమెరికాలోని మియామి, న్యూయార్క్, చైనాలోని గ్వాంగ్‌జౌ వంటి నగరాల్లో ప్రధాన ఆందోళన ఆస్తులు, మౌలిక వసతులకు కలిగే భారీ ఆర్థిక నష్టం. కానీ దక్షిణాసియాలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ప్రధాన సమస్య మనుషులే.

ఇళ్లు కోల్పోవడం.. ప్రజలు వలస వెళ్లడం.. జీవనోపాధి దెబ్బతినడం.. తాగునీటి కొరత.. ఆరోగ్య సమస్యలు.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని UN నివేదిక స్పష్టం చేసింది.

ఇప్పుడే మేలుకోకపోతే?

సముద్ర మట్టాల పెరుగుదల నెమ్మదిగా జరిగే ప్రక్రియ కావచ్చు. కానీ ఒకసారి తీర ప్రాంతాలు శాశ్వతంగా నీట మునిగితే పరిస్థితిని వెనక్కి తిప్పడం చాలా కష్టం.

అందుకే ముందస్తు ప్రణాళిక, తీర ప్రాంతాల రక్షణ, వరద నిర్వహణ, మంచినీటి వనరుల సంరక్షణ, మెరుగైన డేటా, శాస్త్రీయ పరిశోధన, పునరావాస ప్రణాళికలు అత్యవసరమని ఐక్య‌రాజ్య స‌మితి చెబుతోంది. ముంబై, కోల్‌కతాకు ఇది కేవలం వాతావరణ హెచ్చరిక కాదు.. భవిష్యత్ నగర ప్రణాళికకు పెద్ద సవాల్.

#Sea Level Rise#Mumbai#Kolkata#Climate Change#UN Report#Global Warming#Coastal Flooding#India Climate Change#Mumbai Flood Risk#Kolkata Flood Risk#Climate Crisis#Rising Seas
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి