Cm Revanth: ఢిల్లీ పర్యటలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గంటకు పైగా వీరి సమావేశం జరిగింది. తెలంగాణలో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలపై వేణుగోపాల్ తో చర్చించారు రేవంత్ రెడ్డి. ఈ భేటీలో ప్రధానంగా మంత్రి కొండా సురేఖ వివాదంతో పాటు ఇతర రాజకీయ అంశాలపై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిమాణాలపై ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు, వారు ఇచ్చిన వివరణ అంశాలపైనా కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ చర్చించినట్లు సమాచారం.
అటు కొండా సురేఖ ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అపాయింట్ మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ లీడర్లు ఢిల్లీలోనే మకాం వేశారు. అటు అధిష్టానం పిలుపు మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ పెంచాయి.









