ఏలూరు జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై పడి నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. చర్లపల్లి నుంచి షాలిమార్ వైపు వెళ్తున్న స్పెషల్ ట్రైన్ చేబ్రోలు పరిసరాల్లో పట్టాలపై ఉన్న వీరిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు పూర్తిగా ఛిద్రం కావడంతో వారిని గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. అక్కడ "షేక్ హసీనా" అనే పేరుతో ఉన్న ఒక ఏటీఎం కార్డుతో పాటు, తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన బైక్ పార్కింగ్ రసీదు లభ్యమయ్యాయి.












