తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అనర్హులకు పెన్షన్ ఇచ్చారని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తున్నది. దీనికి తోడు మరణించిన వారికి సైతం ఇంకా పెన్షన్ వస్తుందని అధికారులు ఇటీవల గుర్తించారు. దీంతో వారందరినీ ఏరివేసి ప్రజల సొమ్మును సక్రమంగా ఖర్చు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఫోకస్ పెట్టింది.
దీనిలో భాగంగా ప్రస్తుతం లక్ష మందికి పైగా అనర్హులు అక్రమంగా నెలవారీగా పెన్షన్లను అందుకుంటున్నట్లుగా అధికారికంగా గుర్తించింది. కొన్నేళ్ల క్రితమే చనిపోయిన వారి పేరుపై కూడా కొందరు అక్రమార్కులు నెలనెలా డబ్బులు డ్రా చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు, క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. సాంకేతికత ఆధారంగా చేపట్టిన లైఫ్ అథెంటికేషన్.. అనగా పెన్షన్ తీసుకునే వారు ఇంకా బతికే ఉన్నారా? లేదా? అని చెక్ చేయగా అందులో చాలా మంది మరణించినట్టు తేలింది.దీంతో చనిపోయిన, అర్హత లేని వారి పేర్లను పెన్షన్ల జాబితా నుంచి శాశ్వతంగా తొలగించాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇక కొత్తగా పెన్షన్ కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్ కు అర్హులుగా తేల్చినట్టు సమాచారం.












