దీపావళి పండుగ సందర్భంగా శబ్ద, వాయు కాలుష్య నివారణే లక్ష్యంగా సుప్రీంకోర్టు విధించిన మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీపావళి రోజున ప్రజలందరూ రాత్రి 10:00 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలి. ఆ సమయం దాటిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించి క్రాకర్స్ కాలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
టపాసుల విక్రయదారులు, కొనుగోలుదారులు పాటించాల్సిన పలు కీలక నిబంధనలు పరిశీలిస్తే.. బాణసంచా వ్యాపారం చేయాలనుకునే విక్రేతలు ముందుగా పోలీస్ స్టేషన్, అగ్నిమాపక శాఖ (Fire Department), పేలుడు నియంత్రణ విభాగాల (Explosives Control Department) నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలి. ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా టపాసుల విక్రయాలు చేపడితే ఆయా దుకాణాలను వెంటనే సీజ్ చేస్తారు.
అలాగే వ్యాపారులు వ్యాపార ప్రాంగణాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు అత్యవసర నంబర్లు అయిన 112, 101, 108 నంబర్లను కొట్టొచ్చినట్లు కనిపించేలా ప్రదర్శించాలి. ప్రజా సంక్షేమం, భద్రత దృష్ట్యా ప్రతి బాణసంచా దుకాణం వద్ద రక్షణ చర్యలు కచ్చితంగా పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. దుకాణాల మధ్య కనీసం మూడడుగుల ఖాళీ స్థలం ఉండాలని, దుకాణాలు ఎదురెదురుగా ఏర్పాటు చేయకూడదని నిబంధనలు విధించారు.
ప్రతీ షాపు వద్ద నిప్పు రవ్వలు ఆర్పేందుకు ఇసుక బస్తాలు, నీటి డ్రమ్ములు, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలి. అంతేకాకుండా 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్న బాలబాలికలు ఒంటరిగా టపాసులు కొనడానికి వస్తే విక్రయించవద్దు. పండుగ వేళ భద్రతా నిబంధనలకు లోబడి ప్రజలు బాణసంచా కాల్చుకోవాలి. వ్యాపారులు సైతం ముందస్తు జాగ్రత్తలతో బాధ్యతాయుతంగా అమ్మకాలు జరపాలి. ఢిల్లీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుచ తప్పకుండా అమలు చేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.


