అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ
ట్రంప్ పార్టీ ఓటమితో ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..
డాలర్ బలహీనపడటంతో బంగారం ధరలకు ఊపు..
ఇక పసిడి పరుగులేనా..?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు కొత్త సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మిడ్ టర్మ్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. అమెరికా షేర్ మార్కెట్లు దూసుకెళ్లాయి. ఆసియా మార్కెట్లలోనూ సానుకూల వాతావరణం కనిపిస్తోంది. భారత మార్కెట్లు కూడా ఉత్సాహంగా కదులుతున్నాయి. ఇక్కడే మరో ఆసక్తికరమైన పరిణామం. గత కొంతకాలంగా భారీ ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం ధరలు కూడా మళ్లీ పుంజుకుంటున్నాయి.
ఒకవైపు షేర్ మార్కెట్లలో జోష్.. మరోవైపు బంగారానికి డిమాండ్! అసలు ఈ మార్పు వెనుక ఉన్న లెక్కేంటి? ట్రంప్ పార్టీ ఓటమి బంగారం ధరలకు ఎలా కలిసొచ్చింది?
ట్రంప్ పార్టీకి ఎదురుదెబ్బ.. మార్కెట్లకు ఊరట!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ ఆధిపత్యం సాధించారు. దీంతో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి పెద్ద రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది.
ఈ ఫలితాలను మార్కెట్లు సానుకూలంగా తీసుకున్నాయి. ట్రంప్ తీసుకునే నిర్ణయాలపై ఇకపై కాంగ్రెస్‌లో ఎక్కువ స్థాయిలో చర్చ, మానిటరింగ్ ఉండొచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. టారిఫ్ లు, అంతర్జాతీయ సంబంధాలు, ప్రభుత్వ ఆర్థిక విధానాల విషయంలో ఏక పక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట పడొచ్చన్న అంచనాలు పెరిగాయి.
దీంతో అమెరికా మార్కెట్లలో భారీ ర్యాలీ కనిపించింది. నవంబర్ 4న డౌ జోన్స్ ఏకంగా 1,569 పాయింట్లకు పైగా పెరిగింది. ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్ కూడా లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలోనూ ఎక్కువ చోట్ల సానుకూల వాతావరణం కనిపించింది.
భారత మార్కెట్లలో కూడా కొనుగోళ్లు పెరిగాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,600 పాయింట్లకు పైగా ఎగబాకగా, నిఫ్టీ కూడా రెండు శాతం వరకు లాభపడింది. అంటే అమెరికాలో వచ్చిన రాజకీయ మార్పు ప్రపంచ పెట్టుబడిదారుల ఆలోచనల్లోనూ మార్పు తీసుకొస్తోంది.
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం బంగారం. గత అక్టోబర్‌లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ఔన్సు ధర 4,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది.
అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత డాలర్ బలహీనపడింది. అమెరికా ప్రభుత్వ బాండ్లపై వచ్చే రాబడి కూడా తగ్గింది. ఈ రెండు పరిణామాలు బంగారానికి మద్దతుగా మారాయి.
ఎందుకంటే బంగారం వడ్డీ ఇచ్చే పెట్టుబడి కాదు. అమెరికా బాండ్లపై రాబడి తగ్గితే బంగారాన్ని కొనుగోలు చేయడం పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారుతుంది. అదే సమయంలో డాలర్ బలహీనపడితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనడం కొంత చౌకగా మారుతుంది. అందుకే షేర్ మార్కెట్లు పెరుగుతున్నప్పటికీ బంగారం కూడా పుంజుకుంటోంది.
మార్కెట్లలో భయం తగ్గింది. కానీ బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గలేదు. ఇదే ఇప్పుడు కనిపిస్తున్న ప్రత్యేకమైన పరిస్థితి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు సుమారు రూ.3,880 పెరుగుదల నమోదైంది. అంటే ఒక్కరోజులోనే దాదాపు 2.77 శాతం పెరిగింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక బంగారం పరుగులు ఆగవా?
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ట్రంప్ పార్టీ ఓటమి ఒక్కటే బంగారం ధరలను నిర్ణయించదు. అంతర్జాతీయంగా డాలర్ విలువ, వడ్డీ రేట్లు, అమెరికా బాండ్ ఈల్డ్స్, చమురు ధరలు, పశ్చిమాసియా పరిస్థితులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అమెరికా రాజకీయాల్లో వచ్చిన మార్పు మార్కెట్లకు కొంత ఊరటనిచ్చింది. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పూర్తిగా తొలగిపోయిందని చెప్పలేం.
ఇకపై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ ల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అమెరికా కాంగ్రెస్ వాటిపై ఎలా స్పందిస్తుంది? అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుతాయా? ఇవన్నీ మార్కెట్ల తదుపరి ప్రయాణాన్ని నిర్ణయించనున్నాయి.
ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత మార్కెట్లలో కొత్త ఉత్సాహం మొదలైంది. అదే సమయంలో బంగారం కూడా మళ్లీ పైకి కదులుతోంది.
బంగారం పరుగులు ఇంకా ఎంత దూరం వెళ్తాయి? ధరలు మళ్లీ పాత గరిష్ఠాలను అందుకుంటాయా? లేక ఈ పెరుగుదల కొంతకాలానికే పరిమితమవుతుందా? ప్రపంచ మార్కెట్ల తదుపరి కదలికలే దీనికి సమాధానం చెప్పాలి.


