అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్, సెనెట్‌లో ఓటమి పాలవ్వడంపై ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు నిన్న రాత్రి సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోవడానికి ఇరాన్‌తో యుద్ధమే కారణమని బాంబ్ పేల్చారు. తమ పార్టీ మద్దతుదారులు ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోలింగ్‌కు హాజరైనా 2024లో ట్రంప్‌కు ఓటు వేసిన చాలామంది ఈసారి డెమొక్రాట్లకు ఓటు వేశారని, అందుకే ఓటమి పాలయ్యామని స్పష్టంచేశారు.
ఓటర్లు రాలేదన్నది అవాస్తవం..
తమ పొలిటికల్ అనలిస్టులు భావించినట్లుగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఓటు వేయడానికి రాలేదనేది అవాస్తవం అన్నారు. ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చారని, 2024లో ట్రంప్, వాన్స్‌కు ఓటు వేసిన చాలామంది ఓటర్లు ఈసారి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే తమ ఓటర్లు సైతం ప్రత్యర్థి డెమొక్రాట్లకు ఓటేశారని.. డేటా ఆధారంగా అనలిస్టులు విశ్లేషించారన్నారు. ఈ ఎన్నికల్లో తమ మద్దతు దారులు దూరం అయ్యారని, వారు తిరిగి రావాలంటే నాలుగు కీలక అంశాలను అమలు చేయాలన్నారు. ఇరాన్‌తో యుద్ధాన్ని వెంటనే ముగించడం, జీవన వ్యయంతో పాటు ద్రవ్యోల్బణంపై దృష్టి పెట్టడం, ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయడం, ఇజ్రాయెల్‌తో యూఎస్ సంబంధాల్లో మార్పులు తేవడం వంటివి ఉన్నాయన్నారు.
ట్రంప్ అంగీకరించారు..
మధ్యంతర ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి అసలు కారణం యుద్ధమేనని..ఈ చేదు నిజాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా నిన్న రాత్రి అంగీకరించారని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. యుద్ధం వల్లే సెనెట్‌ను కోల్పోవడం సరైన మూల్యమే అని అన్నారని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఎవరైనా సమర్థించుకుంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు కానీ, ఓటమికి యుద్ధమే కారణమనేది నిజమని ఒప్పుకున్నారని చెప్పారు.
రాబోయే కొన్ని నెలల్లో ఓటమిపై రకరకాల చర్చలు, క్షమాభిక్ష వంటి ప్రతిపాదనలు తెరపైకి రావచ్చని, చట్టవిరుద్ధంగా కార్మికులను నియమించుకునే వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవడమే నిజమైన పరిష్కారమని స్పష్టంచేశారు. పార్టీపై, ఎన్నికల ఫలితాలపై కోపంగా ఉన్న మద్దతుదారులు, ఆ కోపాన్ని తమ అనుకూలంగా కట్టుబడి ఉండే రిపబ్లికన్లను గెలిపించడానికి ఉపయోగించాలని రిక్వెస్ట్ చేశారు. అందరం కలిసి మళ్లీ దేశాన్ని కాపాడుకునే పనిలో ఉండాలని జేడీ వాన్స్ పిలుపునిచ్చారు.


