ఒకవైపు మెటా, ఎన్విడియా, పలంటీర్..
మరోవైపు ఓపెన్ ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్!
AI భవిష్యత్తుపై టెక్ దిగ్గజాల మధ్య మొదలైన పోరాటం
ప్రపంచాన్ని మార్చేస్తుందని భావిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు మరో యుద్ధానికి వేదికగా మారింది. ఈ యుద్ధంలో ఆయుధాలు లేవు. సైన్యాలు లేవు. కానీ ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు రెండు వర్గాలుగా విడిపోతున్నాయి. ఒకవైపు ఎన్విడియా, మెటా, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, పలంటీర్ వంటి సంస్థలు. మరోవైపు ఓపెన్ ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్ వంటి సంస్థలు. వీళ్ల మధ్య అసలు గొడవ ఏంటి? AIని ఎవరు ఉపయోగించాలి అన్నదా? ఎవరు ఎక్కువ తెలివైన AIని తయారు చేస్తారన్నదా? కాదు. అంతకంటే పెద్ద ప్రశ్న ఉంది.
భవిష్యత్తులో AI టెక్నాలజీని ప్రపంచమంతటికీ అందుబాటులో ఉంచాలా? లేక కొద్దిమంది కంపెనీల నియంత్రణలోనే ఉంచుకోవాలా? ఇదే ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్.
అసలు గొడవ ఏంటి? ఓపెన్ AI.. క్లోజ్డ్ AI అంటే ఏమిటి?
ముందుగా ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. చాట్‌జీపీటీ లాంటి AI వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి? కోట్లాది సమాచారం, ట్రైనింగ్, లెక్కల ఆధారంగా వాటికి సమాధానాలు చెప్పే సామర్థ్యం వస్తుంది. ఈ శిక్షణ ద్వారా తయారయ్యే మోడల్‌లోని ముఖ్యమైన సంఖ్యల సముదాయాన్నే 'వెయిట్స్' అంటారు. ఇప్పుడు ఈ వెయిట్స్‌ను అందరికీ అందుబాటులో ఉంచితే దాన్ని ఓపెన్ వెయిట్ మోడల్ అంటారు.
అంటే ఒక కంపెనీ తయారు చేసిన AI మోడల్‌ను మరో కంపెనీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తన సర్వర్లలో నడుపుకోవచ్చు. తన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. కొత్త శిక్షణ ఇవ్వొచ్చు.
దీనికి విరుద్ధంగా క్లోజ్డ్ మోడల్స్ ఉంటాయి. వీటిని తయారు చేసిన కంపెనీ తన దగ్గరే ఉంచుకుంటుంది. వినియోగదారులు ఏపీఐ లేదా క్లౌడ్ సేవల ద్వారా ఉపయోగించుకోవాలి. అసలు మోడల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ ఇష్టానుసారం మార్చుకోలేరు. ఇక్కడే రెండు వర్గాల మధ్య పోరు మొదలైంది.
AI అనేది కొద్దిమంది కంపెనీల సొత్తు కాకూడదని, ప్రపంచంలోని ప్రతి డెవలపర్‌కు, ప్రతి సంస్థకు అందుబాటులో ఉండాలని ఒక వర్గం చెబుతోంది. అదే సమయంలో అత్యంత శక్తివంతమైన AI మోడల్స్‌ను అందరికీ ఇచ్చేస్తే వాటిని ఎవరు ఎలా ఉపయోగిస్తారో నియంత్రించడం కష్టమవుతుందని మరో వర్గం వాదిస్తోంది. దీంతో భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందనేది ఆ వర్గం టెన్షన్. రెండు వాదనల్లోనూ బలమైన కారణాలు ఉన్నాయి.
వాషింగ్టన్‌కు 25 కంపెనీల లేఖ!
ఈ వివాదం గత జూలై 24న మరో స్థాయికి చేరింది. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, మెటా, ఐబీఎం, పలంటీర్ సహా 25 టెక్నాలజీ సంస్థలు కలిసి అమెరికా ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాశాయి. 'ఓపెన్ వెయిట్స్ అండ్ అమెరికన్ ఏఐ లీడర్‌షిప్' అనేది ఆ లేఖ పేరు.
AI మోడల్స్‌పై ముందస్తు ఆంక్షలు విధించకుండా, ఓపెన్ వెయిట్ టెక్నాలజీని ప్రోత్సహించాలని ఈ సంస్థలు కోరాయి. ఈ 25 సంస్థల జాబితాలో ఓపెన్ ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్ లేవు. ఓపెన్ ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మన్ మాత్రం అమెరికా ఓపెన్, ప్రొప్రైటరీ.. రెండు రకాల AIలోనూ ముందుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ఓపెన్ ఏఐ కూడా 2025లో ఓపెన్ వెయిట్ మోడల్స్ విడుదల చేసింది. కానీ తన అత్యంత శక్తివంతమైన మోడల్స్‌ను మాత్రం ఏపీఐ సేవల ద్వారానే అందిస్తోంది. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఈ ఉద్యమానికి బలంగా మద్దతు పలుకుతున్నారు.
ఆయన వాదన వెనుక ఒక బిజినెస్ లెక్క కూడా ఉంది. AI మోడల్స్‌ను అందరూ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. కానీ వాటిని నడపడానికి శక్తివంతమైన కంప్యూటర్లు, జీపీయూ చిప్స్ అవసరం. ఆ చిప్స్ తయారీలో ఎన్విడియా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. అంటే AI మోడల్స్ అందరికీ అందుబాటులోకి వస్తే.. వాటిని నడిపించే చిప్స్‌కు డిమాండ్ కూడా పెరుగుతుంది.
మరోవైపు ఎన్విడియా మార్చిలోనే మిస్ట్రాల్, పెర్ప్లెక్సిటీ సహా పలు AI సంస్థలతో కలిసి నెమోట్రాన్ కొలిషన్ ఏర్పాటు చేసింది. లక్ష్యం.. శక్తివంతమైన ఓపెన్ AI మోడల్స్ తయారు చేయడం. ఇక్కడ సిద్ధాంతం ఉంది. అదే సమయంలో వ్యాపార ప్రయోజనం కూడా ఉంది.
జుకర్‌బర్గ్ వ్యూహం.. AIని అందరికీ ఇవ్వాలా?
మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఓపెన్ AIకి మద్దతు ఇస్తున్నారు. గతంలో మెటా తన లామా మోడల్స్‌ను డెవలపర్లకు అందుబాటులో ఉంచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఏప్రిల్‌లో విడుదల చేసిన మ్యూజ్ స్పార్క్ మాత్రం క్లోజ్డ్ మోడల్‌గా వచ్చింది.
ఆ తర్వాత ఆగస్టు 10న మ్యూజ్ గ్లిమ్మర్ పేరుతో ఓపెన్ వెయిట్ మోడల్‌ను విడుదల చేసింది. స్పార్క్ వెయిట్స్‌ను కూడా విడుదల చేస్తామని ప్రకటించింది. AIని కొద్దిమంది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకరించడం ప్రమాదకరమని జుకర్‌బర్గ్ వాదిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఒక వ్యాపార కోణం ఉంది.
మెటా ప్రధాన ఆదాయం ప్రకటనల నుంచి వస్తుంది. AI మోడల్స్‌ను అమ్మడమే దాని ప్రధాన వ్యాపారం కాదు. కాబట్టి తన మోడల్స్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచడం ద్వారా డెవలపర్లను ఆకర్షించవచ్చు. అదే సమయంలో AI సేవలకు డబ్బులు వసూలు చేసే ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచవచ్చు. అంటే జుకర్‌బర్గ్‌కు ఓపెన్ AI ఒక సిద్ధాంతం మాత్రమే కాదు. మార్కెట్‌లో తన స్థానాన్ని బలపరుచుకునే వ్యూహం కూడా!
ఓపెన్ ఏఐ, గూగుల్ ఎందుకు భయపడుతున్నాయి?
ఇప్పుడు మరోవైపు ఉన్న సంస్థల వాదన చూద్దాం. ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్ వంటి సంస్థలు అత్యంత శక్తివంతమైన AI మోడల్స్ తయారు చేయడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. వేల కోట్ల డాలర్ల ఖర్చుతో డేటా సెంటర్లు నిర్మిస్తున్నాయి. అత్యాధునిక చిప్స్ కొనుగోలు చేస్తున్నాయి. వేలాది మంది నిపుణులతో మోడల్స్‌కు శిక్షణ ఇస్తున్నాయి. ఇంత ఖర్చు పెట్టి తయారు చేసిన మోడల్స్‌ను అందరికీ ఉచితంగా ఇచ్చేస్తే తమ వ్యాపారం ఎలా నడుస్తుంది? అదీ ఒక కారణం.
కానీ అంతకంటే ముఖ్యమైనది భద్రత. ఒక క్లోజ్డ్ AI మోడల్‌లో ప్రమాదకరమైన లోపం కనిపిస్తే కంపెనీ దాన్ని సరిచేయగలదు. అవసరమైతే సేవను నిలిపివేయగలదు. కొన్ని నియంత్రణలు విధించగలదు. కానీ ఓపెన్ వెయిట్ మోడల్‌ను ఒకసారి ప్రపంచానికి విడుదల చేశాక దాని కాపీలు వేలాది సర్వర్లలోకి వెళ్లిపోవచ్చు. ఎవరైనా దాని భద్రతా పరిమితులను తొలగించి ప్రమాదకరమైన పనులకు ఉపయోగించవచ్చు. అప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడం దాదాపు అసాధ్యం. ఇదే క్లోజ్డ్ AI కంపెనీల ప్రధాన వాదన.
అమెరికా వర్సెస్ చైనా.. అసలు ఆట ఇక్కడే ఉందా?
ఈ పోరాటంలో మరో కీలక అంశం చైనా. డీప్‌సీక్, అలీబాబా, మూన్‌షాట్ వంటి చైనా సంస్థలు తక్కువ ఖర్చుతో శక్తివంతమైన AI మోడల్స్ తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఓపెన్ మోడల్స్‌ను ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు ఉపయోగించడం అమెరికా టెక్ కంపెనీలకు ఒక కొత్త సవాలుగా మారింది.
అమెరికా కంపెనీలు తయారు చేసిన ఖరీదైన క్లోజ్డ్ మోడల్స్ సామర్థ్యాన్ని చైనా సంస్థలు తక్కువ ఖర్చుతో కాపీ చేసి, తమ సొంత మోడల్స్ అభివృద్ధి చేస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనినే AI పరిభాషలో డిస్టిలేషన్ అంటారు. ఒక శక్తివంతమైన మోడల్ నుంచి వచ్చిన సమాధానాలు, ప్రవర్తన ఆధారంగా మరో మోడల్‌కు శిక్షణ ఇవ్వడం ఇందులో భాగం.
అమెరికాకు ఇప్పుడు ఒక సందిగ్ధ పరిస్థితి. ఓపెన్ AIని ప్రోత్సహిస్తే చైనా సంస్థలు కూడా దాని ప్రయోజనం పొందుతాయి. ఆంక్షలు పెడితే ప్రపంచ మార్కెట్‌లో చైనా మోడల్స్‌కు మరింత అవకాశం లభించవచ్చు. అందుకే ఈ పోరాటం కేవలం కంపెనీల మధ్య వ్యాపార పోటీ కాదు. అమెరికా, చైనా మధ్య టెక్నాలజీ ఆధిపత్య పోరులో కూడా భాగమైంది.
చివరికి గెలిచేది ఎవరు? సామాన్యులకు లాభమా? నష్టమా?
ఈ మొత్తం పోరాటంలో సామాన్యులకు ఏం లాభం? ఒక చిన్న కంపెనీకి శక్తివంతమైన AI అవసరమైందనుకుందాం. ప్రతి నెలా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి క్లోజ్డ్ AI సేవలు కొనాల్సిన అవసరం లేకుండా ఓపెన్ మోడల్‌ను తన సర్వర్‌లోనే నడుపుకోవచ్చు.
ఒక ఆసుపత్రి తన రోగుల సమాచారాన్ని బయటకు పంపకుండా సొంత AI వ్యవస్థను తయారు చేసుకోవచ్చు. ఒక ప్రభుత్వ సంస్థ తన భాష, తన అవసరాలకు తగ్గట్టుగా AIని మార్చుకోవచ్చు. అంటే ఓపెన్ AI వల్ల ఖర్చులు తగ్గుతాయి. కొత్త ఆవిష్కరణలకు అవకాశం పెరుగుతుంది. చిన్న కంపెనీలకు కూడా పెద్ద టెక్నాలజీని ఉపయోగించే అవకాశం వస్తుంది.
అదే సమయంలో భద్రతా నియంత్రణలు తగ్గితే సైబర్ దాడులు, మోసాలు, ప్రమాదకరమైన వినియోగం పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ఓపెన్ AI పూర్తిగా మంచిదని, క్లోజ్డ్ AI పూర్తిగా చెడ్డదని చెప్పలేం. భవిష్యత్తులో ఈ రెండు విధానాలూ కలిసి నడిచే అవకాశమే ఎక్కువ.
సాధారణ పనులకు తక్కువ ఖర్చుతో పనిచేసే ఓపెన్ మోడల్స్.. అత్యంత క్లిష్టమైన పనులకు శక్తివంతమైన క్లోజ్డ్ మోడల్స్ ఉపయోగించే విధానం ఇప్పటికే ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
చివరికి AI ప్రపంచంలో ఎవరు గెలుస్తారన్నదానికంటే.. AIపై నియంత్రణ ఎవరి చేతుల్లో ఉండాలి? దాని ప్రయోజనాలు ప్రపంచంలోని అందరికీ అందాలా? లేక కొద్దిమంది కంపెనీలకే పరిమితం కావాలా? అన్నదే అసలు ప్రశ్న.


