TG: గ్రేటర్ హైదరాబాద్ వాసులను రెండు రోజులుగా ముచ్చెమటలు పట్టించిన వాటర్ ట్యాంకర్ల సమ్మెకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తనదైన మార్క్ వ్యూహంతో ఫుల్స్టాప్ పెట్టారు. బెట్టు వీడని ట్యాంకర్ల యజమానులతో నేరుగా చర్చలు జరిపి, అటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఇటు వాణిజ్య అవసరాలకు అంతరాయం లేకుండా ఆయన చూపించిన ప్రత్యామ్నాయ పరిష్కారం బాగా పనిచేసింది. కమిషనర్ ప్రతిపాదించిన మార్గానికి యజమానులు ఒప్పుకోవడంతో సమ్మె తక్షణమే ముగిసింది. నగరవ్యాప్తంగా నీటి సరఫరా పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ పడింది.
1500 అడుగుల బోర్లు.. ఆధారాలతో కడిగిపారేసిన రంగనాథ్
హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలతో వాటర్ ట్యాంకర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందం బుధవారం హైడ్రా కార్యాలయానికి చేరుకుంది. ఈ భేటీలో కమిషనర్ రంగనాథ్ అసలు వాస్తవాలను టేబుల్‌పై పెట్టి లెక్కలతో సహా నిలదీశారు. నగరంలో సాధారణ ప్రజలు తమ ఇళ్ల అవసరాల కోసం 100 నుంచి 300 అడుగుల లోతులోనే బోర్లు వేసుకుంటుంటే.. వ్యాపార ప్రయోజనాల కోసం కొందరు ఏకంగా 1,000 నుంచి 1,500 అడుగుల లోతుకు వెళ్లి భారీ మోటార్లతో భూగర్భ జలాలను తోడేస్తున్న తీరును ఎండగట్టారు.
ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, అమీర్‌పేట, అశోక్‌నగర్ వంటి రద్దీ ప్రాంతాల్లో డీజిల్, రవాణా ఖర్చులు మిగుల్చుకునేందుకు సమీప బోర్ల నుంచే నీటిని విచ్చలవిడిగా లాగేస్తున్నారని గుర్తుచేశారు. ఫలితంగా స్థానికుల గృహ అవసరాల బోర్లు పూర్తిగా ఎండిపోయి ప్రజలు అల్లాడుతున్నారని వివరించారు. తెల్లాపూర్, సూరారం, జీడిమెట్ల కాలనీల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎందుకు నిరసనలు తెలుపుతున్నారో, చెరువుల పరిధిలోని అక్రమ వాణిజ్య బోర్లను తాము ఎందుకు తొలగించాల్సి వచ్చిందో స్పష్టంగా వివరించారు.
ఓఆర్ఆర్ అవతలి నుంచే నీటి సేకరణ..
భూగర్భ జలాల సంక్షోభ తీవ్రతను, అధికారుల పక్కా ఆధారాలను చూసిన ట్యాంకర్ల అసోసియేషన్ వెనక్కి తగ్గక తప్పలేదు. నగర ప్రజల తాగునీటిని వాణిజ్య అవసరాలకు కొల్లగొట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన రంగనాథ్.. పక్కా ప్రత్యామ్నాయాన్ని వారి ముందుంచారు. ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉండే 'ప్యూర్' ప్రాంతాల నుంచి సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులతో మాత్రమే నీటిని తోడి నగరానికి సరఫరా చేయాలని ఆదేశించారు. కమిషనర్ పెట్టిన ఈ ప్రతిపాదనకు ట్యాంకర్ల యజమానులు పూర్తి అంగీకారం తెలిపారు. ఇకపై నగర పరిధిలో భూగర్భ జలాలను తోడబోమని, తమ కార్యకలాపాలన్నీ ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాల నుంచే సాగిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవ పరిస్థితులను వివరించి సరైన దారి చూపినందుకే తాము బాధ్యతాయుతంగా సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.


