TG: వరదల్లో చిక్కుకున్న జాలర్లను ప్రాణాలకు తెగించి కాపాడేందుకు వెళ్లిన రెస్క్యూ టీమ్‌కే ముప్పు వాటిల్లింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి వద్ద అత్యంత విషాదకర సంఘటన వెలుగుచూసింది. చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు రంగంలోకి దిగిన రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ బోట్లు వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. ఈ ప్రమాద సమయంలో ఆ రెండు బోట్లలో కలిపి మొత్తం 10 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందడంతో తీవ్ర కలకలం రేగుతోంది.
ముగ్గురిని కాపాడారు.. అంతలోనే
వివరాల్లోకి వెళ్తే.. బేతుపల్లి చెరువులో వరద నీరు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఐదుగురు జాలర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నీటి మధ్యలోనే చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. రెండు ప్రత్యేక బోట్లతో చెరువులోకి వెళ్లి, ఎంతో శ్రమించి ముగ్గురు జాలర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే మిగిలిన ఇద్దరు జాలర్లను రక్షించే ప్రయత్నం చేస్తుండగా.. ఎగువ నుంచి వరద పోటు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. వరద తీవ్రతకు తట్టుకోలేక రెస్క్యూ సిబ్బంది ఉన్న రెండు బోట్లు నియంత్రణ కోల్పోయి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాయి.
ఆచూకీ కోసం ముమ్మర గాలింపు
ప్రాణాలు కాపాడేందుకు వెళ్లిన సిబ్బందే వరదలో కొట్టుకుపోవడంతో ఘటనా స్థలంలో తీవ్ర ఆందోళన, ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గల్లంతైన 10 మంది సిబ్బందితో పాటు మిగిలిన ఇద్దరు జాలర్ల ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు వెంటనే మరో రెస్క్యూ బోటును రంగంలోకి దించారు. స్థానిక యంత్రాంగం, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


