Land Grab: బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ పై సంచలన ఆరోపణలు చేశారు. గచ్చిబౌలిలో గుడిసెలు వేసి.. ఎంపీ బలరాం నాయక్ వెయ్యి కోట్ల ల్యాండ్ స్కామ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు కాపాడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ ఆయన పార్టీ ఎంపీ పోరిక బలరాం నాయక్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ నడి ఒడ్డున శేరిలింగంపల్లిలోని 4.13 ఎకరాల ఎస్సీలకు చెందిన భూమిని కబ్జా చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
భూమి విలువ వెయ్యి కోట్లు
ఈ ప్రభుత్వ భూమి విలువ అక్షరాలా 1000 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి తెలియకుండా ఈ కబ్జా జరగదన్నారు. ఎందుకంటే హైడ్రా, రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసు శాఖలన్నీ రేవంత్ దగ్గరే ఉన్నాయన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
సీఎం, మంత్రుల భూములను ఆక్రమించుకోండి
ఎంపీ బలరాం నాయక్ కు భూ కబ్జాలు చేయాలని అంత కోరిక ఉంటే రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన భూములు వందల ఎకరాలు ఉన్నాయని.. వాళ్ల భూములు కబ్జా చేయాలని సూచించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంతేకానీ కబ్జా చేయడానికి ఎస్సీల భూములే దొరికాయా? అని నిలదీశారు. డప్పులు, చెప్పులు, పారిశుద్ధ్య పనులు చేసే పేద ఎస్సీ బిడ్డలు విదేశాలకు పోవాలి, అగ్రగామి శక్తిగా ఎదగాలని కేసీఆర్ ప్రభుత్వం భూమిని కాపాడితే, ఇపుడేమో కాంగ్రెస్ నాయకులే కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.
15 రోజుల డెడ్ లైన్
భూమి కాపాడతారో, లేక రాజీనామా చేస్తారో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తేల్చుకోవాలన్నారు. 15 రోజుల్లో భూమిలోని అక్రమ నివాసాలు తొలగించి, సాంఘీక సంక్షేమ శాఖకు అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
''ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఎస్సీల భూములను ఆక్రమిస్తోంది. శేరిలింగంపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ కు చెందిన 4 ఎకరాల 13 గుంటల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ ఎంపీ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారం ఉంది. కబ్జాలు చేయాలనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, మంత్రుల భూములను ఆక్రమించుకోండి. శేరిలింగంపల్లి భూముల కబ్జా వ్యవహారంపై విచారణ కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాస్తా. 15 రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను తొలగించి భూములను ఎస్సీ సంక్షేమ శాఖకు అప్పగించాలి.
ఎస్సీల భూములు ఆక్రమించే ప్రయత్నం
చేవెళ్ల సాక్షిగా ఎస్సీలను ఎస్టీలను ఘోరంగా మోసం చేసి ఆ ఎస్సీల భూములను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. శేరిలింగంపల్లి మండలంలో 4 ఎకరాల 13 గుంటలను ఏకంగా కాంగ్రెస్ ఎంపీ కబ్జా చేస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దానికి సహకారం అందిస్తున్నారు. చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఈ భూ కబ్జా వెనక మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అక్కడ గజం 5 లక్షల రూపాయలు ఉంటుంది. 4 ఎకరాల 13 గుంటలు అంటే దాదాపుగా 1000 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని ఈరోజు కబ్జా చేస్తున్నారు. కబ్జా చేయాలని ఉంటే మీకు ఎస్సీల భూమే దొరికిందా?'' అంటూ నిప్పులు చెరిగారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
భూకజ్జాకు మంత్రి సపోర్ట్
''రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల భూములకు రక్షణ లేదు. ఎస్సీల భూములను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతాల్లో భూకబ్జా చేశారంటే అది వేరే సంగతి. కానీ, హైదరాబాద్ నగరం నడిబొడ్డున శేరిలింగంపల్లి మండలంలో గజం కనీసం 5లక్షలు విలువ చేస్తుంది. అక్కడ 4 ఎకరాల 13 గుంటలను ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ కబ్జా చేస్తున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దానికి సహకారం అందిస్తున్నారు'' అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిచాంచారు.
9వేల 200 ఎకరాలు.. 5లక్షల కోట్ల స్కామ్
''బీఆర్ఎస్ వాళ్ల దగ్గరి నుంచి ప్రభుత్వ భూములు రక్షించా అని సీఎం రేవంత్ గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో కేసీఆర్ చేసిన మంచి పనులన్నీ నేనే చేసినా అని చెప్పుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే.. కేసీఆర్ శ్రమ వల్ల మియాపూర్ లో 550 ఎకరాల భూమి రక్షింపబడింది. అయితే, ఆ భూమిని నేనే రక్షించాను, నా ద్వారా ఈరోజు సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు.
ఆ మరుసటి రోజే ఆ భూమిని బేరానికి పెట్టే పన్నాగం పన్నారు. అలాంటి రేవంత్ రెడ్డి చేతిలో ఏ ప్రభుత్వ భూమి కూడా సేఫ్ గా లేదు. 9వేల 200 ఎకరాలు.. 5లక్షల కోట్ల స్కామ్ కు పాల్పడుతున్నారు. 9వేల 200 ఎకరాల భూమిని 30శాతం ధరకే తన అస్మదీయులకు విక్రయించే ప్రయత్నం హిల్ట్ పాలసీ ద్వారా రేవంత్ రెడ్డి చేస్తున్నారు'' అని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు.


