Debit Card Limit: అత్యవసరంగా క్యాష్ కావాల్సి వచ్చినప్పుడు మనందరం ఏటీఎంల వైపే పరిగెడతాం. అయితే ఒక రోజులో ఏటీఎం నుంచి ఎంత వరకు డ్రా చేసుకోవచ్చనే విషయంపై చాలామందికి సరైన క్లారిటీ ఉండదు. రోజుకు రూ.10,000 లేదా రూ.20,000 మాత్రమే వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవానికి మీ బ్యాంకు రూల్స్, మీ చేతిలో ఉన్న ఏటీఎం కార్డు రకాన్ని బట్టి రోజుకు ఏకంగా రూ.లక్ష వరకు కూడా నగదు డ్రా చేసుకునే వీలుంది.
బ్యాంకుల వారీగా రోజువారీ విత్డ్రా లిమిట్స్ ఇవే:
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ సాధారణ క్లాసిక్ డెబిట్ కార్డుపై రోజుకు గరిష్టంగా రూ.20,000 వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఇస్తోంది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ సాధారణ డెబిట్ కార్డులపై రోజుకు రూ.25,000 నుంచి రూ.50,000 వరకు క్యాష్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ సాధారణ కార్డుల ద్వారా రోజుకు రూ.25,000 నుంచి రూ.50,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ కార్డు హోల్డర్లు రోజుకు రూ.25,000 నుంచి రూ.50,000 వరకు నగదు తీసుకోవచ్చు. దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకుల్లో ప్లాటినం లేదా సిగ్నేచర్ కార్డులు ఉన్నవారు రోజుకు ఏకంగా రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని కూడా ఏటీఎంల నుంచి తీసుకోవచ్చు.
లిమిట్ ఎలా పెంచుకోవాలంటే
పండుగల టైంలో లేదా ఇంట్లో ఏదైనా అత్యవసర ఖర్చు వచ్చినప్పుడు ఏటీఎం లిమిట్ సరిపోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ముందుగానే మీ కార్డు రోజువారీ పరిమితి ఎంత ఉందో చూసుకోవడం మంచిది. ఒకవేళ మీ లిమిట్ తక్కువగా ఉంటే, మీ బ్యాంకు బ్రాంచ్కు వెళ్లి దరఖాస్తు చేసుకోవడం ద్వారా లేదా ఉన్న కార్డును ప్లాటినం, సిగ్నేచర్ కేటగిరీకి అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీ రోజువారీ విత్డ్రా లిమిట్ సింపుల్గా పెంచుకోవచ్చు.


