Military Spy: సొంత మనుషులతోనే ఉంటూ కడుపునొప్పి అని చెప్పి పక్కకెళ్లాడు. అంతలోనే శత్రువులకు లొకేషన్ పంపి బాంబులు వేయించి వందల మందిని లేపేశాడు. రష్యా ఆర్మీలో పనిచేస్తూనే ఉక్రెయిన్‌తో చేతులు కలిపిన ఓ ఆఫీసర్ చేసిన ఈ దారుణం ఇప్పుడు ప్రపంచమంతా హాట్ టాపిక్ అయింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ బయటపెట్టిన ఈ కథనం చూసి అంతా షాక్ అవుతున్నారు.
కడుపునొప్పి అని చెప్పి.. బాంబులు వేయించాడు
రష్యా సైన్యంలో కమ్యూనికేషన్ చూసుకునే స్టుప్నికోవ్ అనే ఆఫీసర్‌కు పుతిన్ చేస్తున్న యుద్ధం అస్సలు నచ్చలేదు. దీంతో ఉక్రెయిన్ వాళ్లతో టచ్‌లోకి వెళ్లి, నెలకు రూ.3 లక్షల పైనే డబ్బులు తీసుకుంటూ రష్యా సైన్యం ఎక్కడుందో ఉక్రెయిన్‌కి చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రోజు అందరూ కలిసి ఉన్న టైంలో కడుపునొప్పి వస్తోందని చెప్పి వాళ్ల నుంచి కాస్త దూరంగా జరిగాడు. వెంటనే తన వాళ్లు ఎక్కడున్నారో కరెక్ట్ లొకేషన్ వివరాలను ఉక్రెయిన్‌కు పంపాడు. మరుక్షణమే ఉక్రెయిన్ అటువైపు రాకెట్లతో దాడి చేసింది. ఆ దెబ్బకు ఓ కల్నల్‌తో సహా 68 మంది రష్యా సైనికులు స్పాట్లోనే చనిపోయారు, ఇంకో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
దాడి జరగగానే ఉక్రెయిన్ నుంచి మెసేజ్ వచ్చింది.. 'అక్కడ పేలుడు ఎలా జరిగింది? ఫొటో పంపు' అని అడిగారు. దానికి ఆ సైనికుడు ఏమాత్రం జాలి లేకుండా.. 'ఇక్కడంతా జస్ట్ మాంసం ముక్కలే మిగిలాయి' అంటూ చాలా కూల్‌గా రిప్లై ఇచ్చాడు. ఇలా ఇతగాడు చేసిన పనుల వల్ల ఏకంగా 300 మందికి పైగా రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. చివరికి ఈ సైనికుడు సొంత దేశంలో తనపై అనుమానం రాకముందే 'పీనట్ షాప్' అనే పాస్వర్డ్ చెప్పి ఉక్రెయిన్ వైపు పారిపోయాడు. కడుపునొప్పి అని చెప్పి పక్కకెళ్లి సొంత వాళ్లనే శవాలుగా మార్చిన ఈ ఆఫీసర్ చేసిన మోసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతోంది.


