కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ అసంతృప్తి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పదవులు వచ్చిన వారు కూడా నిరాశలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా పదవులు దక్కని వారు అలా ఉంటుంటారు.అధిష్టానంతో, పార్టీతో, కీలక నేతలకు దూరంగా అంటిముట్టనట్టు వ్యవహరిస్తుంటారు. లేదా ఇతర పార్టీలవైపు చూస్తుంటారు. కానీ, వీరంతా పార్టీలోనే ఉంటూ పార్టీకి డ్యామేజీ చేస్తున్నారని చర్చ జరుగుతోంది.ఈ జాబితాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లూ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు వడ్డీలు కడుతూనే కొత్తగా అప్పులు తెచ్చి సంక్షేమాన్ని అమలు చేస్తున్నా ప్రభుత్వ పథకాలకు పెద్దగా ప్రచారం రావడం లేదని సమాచారం. మంత్రులు, సీనియర్ లీడర్లు సైతం ప్రతిపక్షాల విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వడం లేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది. అందుకు ఒక్కొక్కరు ఒక్కో కారణాలు చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.ఎవరికి వారు తమకు న్యాయం జరగలేదని, అనుకున్నది దక్కలేదని తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారు ఒకరైతే మధ్యలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేశారని, తమకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదని చాలా మంది రగిలిపోతున్నట్టు పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పదవి వచ్చిన వారు అయితే తమకు ఈ పదవి ఇస్తారా? ఇందులో ఏముంది? ఆ మాత్రం ఇవ్వడం ఎందుకు? ఏం చేసుకోవాలి? అని మండిపడుతున్నట్టు సమాచారం. ఇక పదవి రాని వారు ఒక్కోరకంగా అసంతృప్తితో ఉన్నారని పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎంత కష్టపడ్డాము. అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని నెత్తిన పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీతోనే ఉన్న మమ్మల్ని పక్కనబెట్టారు’ అని కొందరు లీడర్లతో చెప్పుకుని తమ అసంతృప్తిని వెల్లగక్కినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా.. పదవులు వచ్చిన వారు చూసుకుంటారులే తమకు ఎందుకు అనే ధోరణిలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారమే జనాల్లోకి వెళ్తున్నది కానీ, ప్రభుత్వ చేస్తున్న పనులు వెళ్లడం లేదని తెలిసింది. ఈ క్రమంలోనే మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు పీపీపీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా నేతలపై బహిరంగంగానే ‘మీరంతా ఏం చేస్తున్నారు? ఎందుకు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడం లేదు’ అని ప్రశ్నించిన విషయం తెలిసిందే.












