GHMC New Logo: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కి కొత్త లోగో వచ్చింది. ఈ కొత్త లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దాదాపు పదేళ్ల తర్వాత జీహెచ్ఎంసీకి నూతన లోగో వచ్చింది. అలాగే జీహెచ్ఎంసీ నుంచి వేరుపడిన మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) నూతన లోగోలను కూడా సీఎం రేవంత్ లాంచ్ చేశారు. న్యూ ఐడెంటిటీ, న్యూ డెస్టినీ, న్యూ లోగో అని అధికారులు అభివర్ణించారు.
పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ, మెరుగైన పౌర సేవల కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయం విదితమే. జీహెచ్ఎంసీలో ఆరు జోన్లు ఉండగా.. మూడేసి జోన్లతో సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ మహానగరం చుట్టూ 158 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపలి భూభాగాన్ని కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)గా మారుస్తూ పాత జీహెచ్ఎంసీని పునర్విభజన చేసింది ప్రభుత్వం.

మూసారాంబాగ్‌లో పర్యటించిన సీఎం రేవంత్.. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల కొత్త లోగోలను ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరం విద్య, ఉద్యోగ అవకాశాలకు కేంద్రంగా మారిందన్న సీఎవ రేవంత్.. ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నగరం డెవలప్ అవుతోందన్నారు. అందుకు అనుగుణంగా మౌలిక వసతులు, పరిపాలన వ్యవస్థలు కూడా వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే కోర్ అర్బన్ రీజియన్‌గా ఏర్పాటు చేసి నగరాన్ని మరింత సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు.

6 జోన్లతో జీహెచ్ఎంసీ
70 లక్షల జనాభాతో కూడిన 6 జోన్లకు జీహెచ్ఎంసీని పరిమితం చేసింది ప్రభుత్వం. సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లలో సగటున 35 లక్షల జనాభా ఉండే విధంగా 3 జోన్ల చొప్పున విభజించారు. జీహెచ్ఎంసీలో శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ జోన్లు ఉన్నాయి. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉన్నాయి. మల్కాజ్ గిరి కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్ గిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లు ఉన్నాయి.











